టాక్స్ కట్టకుండా లక్షాధికారులు అయ్యే ఛాన్స్.. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే చాలు..?

సాధారణంగా మనిషి జీవించడానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తారు. వయసు పైబడిన తర్వాత పనిచేయటానికి చేతగాని సమయంలో ఇలా పొదుపు చేసుకున్న డబ్బు ఉపయోగపడుతుంది. అయితే ఇలా మనం కష్టపడి సంపాదించిన డబ్బు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మనకి ఉపయోగపడటమే కాకుండా మరొక లాభం కూడా ఉంది. మనం సంపాదించిన ప్రతి రూపాయికి తప్పనిసరిగా గవర్నమెంట్ కి టాక్స్ కట్టాలి. అయితే టాక్స్ భారం పడకుండా మనం పొదుపు చేసుకున్న సొమ్ము నుంచి చక్కని రాబడి పొందటానికి ఒక చక్కటి స్కీమ్ ఉంది. అదే పీపీఎఫ్. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

2022 – 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ నుండి విముక్తి పొందాలనుకునే వారు మార్చి 31 లోగా కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టాలి. పన్నుతో పాటు మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే, మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై 7.1% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ PPF స్కీం పై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. అంటే, మీరు పథకంలో చేసిన మొత్తం పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సమయంలో ఈ స్కీమ్‌లో పెట్టుబడి నుంచి పొందిన వడ్డీ, మెచ్యూరిటీపై పొందిన మొత్తంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పీపీఎఫ్‌ ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూరిటీ అయిన తర్వాత 5-5 సంవత్సరాల వరకు పొడిగింపు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ పథకంలో మొత్తం 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 15, 20 లేదా 25 సంవత్సరాల తర్వాత మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్ ఖాతా తెరవడానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి వార్షికంగా రూ. 1.5 లక్షలుగా ఉంది. అయితే, పీపీఎఫ్‌ ఖాతాను తెరిచిన సంవత్సరం తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫారం 2 నింపడం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు 15 సంవత్సరాల కంటే ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే, మీ ఫండ్ నుండి 1% టీడీఎస్ కింద కట్ చేస్తారు. పీపీఎఫ్‌ ఖాతాను ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో మీ స్వంత పేరు మీద లేదా మైనర్ తరపున ఏ ఇతర వ్యక్తి అయినా తెరవవచ్చు.