ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా…తీవ్రమైన మానసిక , శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సిందే?

మన అభివృద్ధికి, ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. మానసిక ఆరోగ్యంగా లేనప్పుడు శారీరక ఆరోగ్యం సాధ్యం కాదనే చెప్పాలి. నేటి సమాజంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగం,పని ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్యాలు , కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన కారణాలు వంటి అనేక సమస్యలు మన మానసిక అనారోగ్యానికి కారణం అవుతున్నాయని చెప్పవచ్చు.

మానసిక సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. దీర్ఘకాలం పాటు మానసిక సమస్యలతో ఇబ్బంది పడితే తీవ్ర అనారోగ్యాలు తప్పవు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చాలా సార్లు కార్టిసాల్ హార్మోన్ పరిమితికి మించి ఉత్పత్తి చేయడం వల్ల మన శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, బిపి, గుండె జబ్బులు, అనేక మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.

మానసికస్థిరత్వం లోపించిన వాళ్లలో నిద్రలేమి, చిన్న కారణానికి ఎక్కువగా అరవడం లేదా ఎక్కువగా ఆలోచించడం, అభద్రతాభావం, ఏ పని పైన ఉత్సాహం లేకపోవడం, తరచూ నిరాశతో మాట్లాడడం, తప్పు చేశామన్న భావనతో కలిగి ఉండడం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న భావన కలగడం వంటి తీవ్రమైన మానసిక ఆలోచనలతో మానసిక కృంగుబాటుకు లోనవుతారు. ఇలాంటివారు తక్షణం వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మానసిక సమస్యలను జయించడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, ప్రాణయామం, మెడిటేషన్, మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకుంటే మానసిక అలసట తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది.ఇక వారానికి ఒకసారి మీకు ఇష్టమైన వారితో లేదా ప్రదేశానికి వెళ్లి కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రతిరోజు మనకి ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాన్ని చదవడం వంటివి చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.