గత యాభై అరవై ఏళ్లకాలంలో న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, కొందరు హైకోర్టు, సుప్రీమ్ కోర్ట్ న్యాయయమూర్తుల మీద ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలుగులో రెండు పత్రికలు, చానెళ్లు తప్ప మిగిలిన మీడియా మొత్తం జగన్ చేసిన ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇస్తూ వార్తలు క్యారీ చేశాయి. తెలుగుదేశం పార్టీ కరపత్రికలలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం జగన్ ఫిర్యాదు వార్తను అచ్చెయ్యకుండా, దాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేసేవారిని మాత్రం వెతికిపట్టుకుని మరీ ప్రచురిస్తున్నాయి. అయితే చంద్రబాబు కోసం వారు ఎంత తపన పడినప్పటికీ ఆ పత్రికా యాజమాన్యాలకు ప్రజల్లో విశ్వసనీయత కొరవడటంతో వారు ఆశించిన స్పందన రావడం లేదు. ఎవరో బార్ అసోసియేషన్ వారు ఖండించారు అని మొదటిరోజు ఊదర గొట్టారు. విచిత్రంగా ఆ బార్ అసోసియేషన్ ప్రముఖుడే నల్లధనం కేసులో ఇరుక్కుని పోయాడు. తమ అసోసియేషన్ వారు జగన్ మీద చేసిన ఖండనను సదరు అసోసియేషన్ అధ్యక్షుడే ఖండించడం భలే గమ్మత్తు! ఇక వారెవరో అక్షరజ్ఞానం సరిగా లేని విద్యార్థులు జగన్ తీరును ఖండించారంటూ కొన్ని జోకులు పేల్చారు! మొత్తానికి చంద్రబాబును ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెంకించాలనే కాంక్ష వారిలో అణువణువునా గోచరిస్తున్నది.
జగన్ కు మద్దతుగా నిలుస్తున్న మేధావి వర్గాలు
అందుకు భిన్నంగా మొదటిరోజు మౌనంగా ఉన్న కొందరు మేధావులు, హైకోర్టు, సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తులు, ప్రసిద్ధ న్యాయవాదులు, ప్రముఖ ఆంగ్ల పత్రికలు జగన్ కు అనుకూలంగా గళాలు వినిపించడం ఒక గొప్ప విశేషంగా చెప్పాలి. ప్రతిరోజూ కొందరు మాజీ న్యాయమూర్తులు స్పంది౯స్తున్నారు. న్యాయమూర్తులు చట్టాలకు అతీతులు కారని, విచారణ జరిపించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో అపరాధం లేదని, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చెయ్యడం రాజ్యాంగవిరుద్ధం కాదని కుండబద్దలు కొట్టడంతో ఇన్నాళ్లు దుర్భేద్యం అనుకున్న న్యాయవ్యవస్థ ముసుగు తొలగడం ప్రారంభం అయింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత నిర్భయంగా, నిర్మొగమాటంగా అత్యంత శక్తివంతమైనదని నమ్ముతున్న న్యాయవ్యవస్థ మీద నేరుగా ఫిర్యాదు లిఖితపూర్వకంగా చెయ్యడం అంటే అది మహా సాహసంగా అభివర్ణిస్తున్నారు. బెంచ్ మీద కూర్చున్న న్యాయమూర్తులు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలమీద, అధినేతల మీద పరుషమైన వ్యాఖ్యలు చెయ్యడం తగదని న్యాయవ్యవస్థ వైఖరిని తప్పు పడుతున్నారు. జస్టిస్ గంగూలీ కానీ, జస్టిస్ చంద్రకుమార్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, వీరంతా జగన్మోహన్ రెడ్డి బంధువులు కారు. జగన్ మెప్పుకోసం మాట్లాడాల్సిన అగత్యం వారికి ఎంతమాత్రం లేదు. జగన్ వ్యవహారంలో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ, వారు స్పందిస్తున్నారంటే న్యాయవ్యవస్థలో విలువలు తరిగిపోతున్నాయనే ఆవేదన మాత్రమే వారిలో కనిపిస్తున్నది. మాజీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం జగన్ ఆ విధంగా ఫిర్యాదు చెయ్యడంలో తప్పు లేదని మీడియా సముఖంలో ప్రకటించారు.
ప్రజల్లో చర్చ మొదలైందా?
ఇక న్యాయవ్యవస్థ పట్ల అంతులేని గౌరవం, భయభక్తులు కలిగిన సామాన్య ప్రజలు కూడా జగన్ దూకుడును నిష్కర్షగా సమర్థిస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని సాహసాన్ని జగన్ ప్రదర్శించారని, ఈ సమయంలో జగన్ కు మద్దతు పలకడం తమ ధర్మమని భావిస్తున్నారు. న్యాయవ్యవస్థలోని అవినీతిని బహిరంగంగా చర్చిస్తున్నారు. పదిమంది రోగుల ప్రాణాలు పోవడానికి కారకుడైన డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చెయ్యద్దని, కేసులు పెట్టొద్దని, దర్యాప్తు చెయ్యద్దని, అలాగే రాజధాని భూముల కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ఎసిబిని నివారించడం లాంటి చర్యలు న్యాయవ్యవస్థ తీరుపై అనేక సందేహాలు కలగడానికి కారణాలు అవుతున్నాయి. న్యాయమూర్తులు లక్ష్మణరేఖను దాటుతున్నారని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొందరు న్యాయమూర్తులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, న్యాయమూర్తులకు మధ్య ఉన్న బంధుత్వాలు, చంద్రబాబు కారణంగా తమకు జడ్జి పదవులు దక్కాయని గతంలో కొందరు జడ్జీలు చెప్పిన మాటలు ఇప్పుడు జనబాహుళ్యంలో విస్తృతంగా చర్చించబడుతున్నాయి. కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చంద్రబాబుకు మధ్యనున్న రహస్య సంబంధాల మీద కూడా చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని కోర్టులలో తమ పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు అడ్డుకుంటున్నారని, కొందరు న్యాయమూర్తులు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలెన్నుకున్న జగన్మోహన్ రెడ్డిని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారనే ప్రజల్లో మెల్లగా అభిప్రాయం గూడు కట్టుకుంటున్నది.
ఇపుడు సుప్రీమ్ కోర్ట్ కర్తవ్యమ్ ఏమిటి?
జగన్ చేసిన ఫిర్యాదుపై సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు మాజీ న్యాయమూర్తులు భావిస్తున్నారు. గతంలో ఇలాంటి ఉదంతాలు పెద్దగా చోటు చేసుకోకపోయినప్పటికీ, ఒక ప్రభుత్వాధినేత చేసిన ఆరోపణలను విచారించి సరిదిద్దకపోతే న్యాయవ్యవస్థ విశ్వసనీయత మరింత దెబ్బ తింటుందని మేధావులు నమ్ముతున్నారు. అలాగే న్యాయమూర్తులు చట్టాలకు అతీతులు కారని, రాజ్యాంగం వారికి ప్రత్యేక హక్కులు, అధికారాలను ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇవాళ బెంచ్ మీదున్న న్యాయమూర్తి పొరపాటున రేపు ఏదైనా నేరం చేసి దొరికితే బోనులో నిలబడాల్సి ఉంటుంది. మన రాజ్యాంగం అంత పటిష్టంగా ఉన్నది. న్యాయమూర్తులు కూడా జీతాలు తీసుకుని పనిచేసేవారే కాబట్టి వారూ విచారణలకు సిద్ధం కావాల్సిందే అంటున్నారు.
ఏదేమైనప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దేశం నలుమూలలనుంచి మద్దతు పెరుగుతున్నమాట వాస్తవం. తరువాత ఏమి జరుగుతుందో చూడాలి!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు