అప్పులపై జగన్ సర్కార్ స్పష్టత.. కానీ, అనుమానాలున్నాయ్.!

దేశంలో అప్పులు చేయని రాష్ట్రం ఏమైనా వుంటుందా.? లేనే లేదు. ప్రపంచంలో అగ్ర దేశాలుగా చెలామణీ అవుతున్న దేశాలు కూడా అప్పులు చేయక తప్పని పరిస్థితి. కరోనా కష్ట కాలంలో.. ఎవరూ అప్పులకు అతీతులు కారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది భిన్నమైన పరిస్థితి. విభజన గాయం, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు, వివిధ పథకాలకు సంబంధించిన మిగిల్చిన బాకీలు.. వెరసి, ప్రస్తుత జగన్ సర్కార్ మీద పెను భారం పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, జగన్ సర్కారు మీద కరోనా పంజా అదనం. కేంద్రం, రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమవుతుండడం మరో పెద్ద సమస్య. వీటన్నిటి నడుమ రాష్ట్రాన్ని నడపడమంటే అది కత్తి మీద సాము లాంటిదే జగన్ సర్కారుకి. ఈ క్రమంలోనే అప్పులు తప్పడంలేదు. కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్రం అప్పులు చేస్తున్న వైనం కళ్ళ ముందుకు కనిపిస్తోంది.

దీన్ని దాచే పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా. రాష్ట్ర ఫైనాన్స్ ఎకనమిక్ అఫైర్స్ స్పెషల్ సెక్రెటరీ కృష్ణ దువ్వూరి రాష్ట్ర అప్పుల విషయమై స్పష్టతనిచ్చారు. ‘ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇందులో దాపరికం ఏమీ లేదు. కానీ, ఎక్కడా అవినీతి జరగడంలేదు. అక్రమాలకు ఆస్కారమే లేదు. ప్రతి పైసా, నేరుగా ప్రజలకు వెళుతోంది..’ అంటూ కృష్ణ దువ్వూరి చెప్పుకొచ్చారు. టీడీపీ అనుకూల మీడియా, విపక్షాలు కలిసి కట్టుగా ప్రభుత్వం మీద అప్పుల విషయమై దుష్ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలోనూ అప్పులు జరిగాయనీ, ఆ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు, రాష్ట్రానికి ప్రస్తుతం మరింత ఇబ్బందికరంగా మారాయన్నారు కృష్ణ దువ్వూరి. సరే, ప్రభుత్వం తరఫున ఈ వివరణలో ఎంత వాస్తవం వుంది.? విపక్షాల రాజకీయమేంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సంక్షేమ పథకాలతో ప్రజలకు తాత్కాలిక ప్రయోజనం మాత్రమే కలుగుతోంది. కరోనా సంక్షోభంలో అది వారికి పెద్ద ఊరటే. కానీ, రాష్ట్రం పరిస్థితేంటి.? రాష్ట్రం భవిష్యత్తేమిటి.? రాష్ట్ర ఆదాయం పెరగకపోతే, చేస్తున్న అప్పులకు వడ్డీలు అయినా కట్టగలిగే పరిస్థితి వుంటుందా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న.