భారతీయుడు అనే సినిమాలో హీరో పాత్రధారి అవినీతిపరులను వేటాడి వెంటాడి దారుణంగా లక్షలాదిమంది టీవీల్లో వీక్షిస్తుండగా దారుణంగా నరికిపోగులు పెడితే హర్షధ్వానాలు చేస్తారు. మరొక సినిమాలో హీరో పాత్రధారి కేవలం ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి, ఆ ఒక్కరోజులోనే రాష్ట్రంలోని వ్యవస్థలు అన్నింటినీ ప్రక్షాళన చేస్తే రోమాలు నిక్కబొడుస్తుండగా ఆనందిస్తారు. అలాగే ఇంకొక సినిమాలో హీరో ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి వ్యవస్థలోని అవినీతిని, దుర్మార్గాన్ని చీల్చి చెండాడితే అతను చెప్పే డైలాగులను చప్పట్లు కొడుతూ చూస్తారు. అవినీతిపై సమరశంఖం పూరించిన పాత్రల్లో తెలుగు, తమిళ హిందీ హీరోలు ఎవరు నటించినా, ఎవరు దర్శకత్వం వహించినా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. కానీ, వాస్తవ జీవితంలో ఎవరైనా ఒక హీరో లాంటి నాయకుడు రాష్ట్రానికి అధినేత గా ఎన్నిక కాబడి పదునైన సంస్కరణలు తెచ్చి కుళ్లిపోయిన వ్యవస్థలను ఆసిడ్ తో కడిగిపారేస్తానంటే మాత్రం అడుగడుగునా అడ్డం పడతారు. అతని చర్యలను నిరసిస్తారు. రాజకీయపార్టీలవారే కాదు…అతనిని అభిమానించే వారు కూడా ఆ ప్రక్షాళనను భరించలేరు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్న దృశ్యం ఇదే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాహితం కోరి, రాబోయే తరాల భవిష్యత్తును కాంక్షిస్తూ కొన్ని సంస్కరణలు చేపట్టడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ విధానం కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు కానీ, పేదలకోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం కానీ, రాజధాని పేరుతో జరిగిన అవినీతి, దోపిడీలను వెలికితీయడానికి చేస్తున్న ప్రయత్నాలు కానీ, చంద్రబాబు నాయుడు అండతో వందల కోట్ల రూపాయల విలువైన భూముల ఆక్రమించినవారినుంచి ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో కానీ, కార్మికుల సంక్షేమం కోసం ఎంతో జాగ్రత్తగా వాడాల్సిన నిధులను నాటి మంత్రులు చేసిన కుంభకోణాన్ని వెలికితీసే అంశంలో కానీ, మద్యం అమ్మకాలను తగ్గిస్తూ మధ్య నిషేధం వైపు అడుగులు వేసే విషయంలో కానీ, పేదలకోసం ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ, …ఇలా ఒకటి కాదు రెండు కాదు…అవినీతి అంశం చోటు చేసుకున్న ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానాల్లో తమకున్న పలుకుబడిని వినియోగించి అడుగు ముందుకు పడకుండా విజయవంతంగా ప్రజాద్రోహానికి తెగిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు పెంచారని విపక్షాలే కాదు, మీడియా కూడా విరుచుకుని పడుతున్నది. నిజానికి రోడ్డు ప్రమాదాలు మనదేశంలో చాలా ఎక్కువ. మనదగ్గర నిర్లక్ష్యం అధికం. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించరు. ఇద్దరు ప్రయాణించాల్సిన వాహనం మీద నలుగురు కూడా దర్జాగా నగర వీధుల్లో ప్రయాణిస్తారు. నంబర్ ప్లేట్లు సరిగా ఉండవు. వాహనానికి సంబంధించిన పత్రాలు ఉండవు. నూటికి తొంభై మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోరు. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ మెడ, భుజం మధ్యలో మొబైల్ ను పెట్టుకుని తలకాయను వంచి మాట్లాడుతూ శరవేగంగా నడుపుతారు. పాతికమంది మాత్రమే ప్రయాణించగలిగే పాఠశాల బస్సుల్లో యాభై మందిని కుక్కేస్తారు. సరుకు రవాణాకు మాత్రమే వినియోగించాల్సిన లారీలలో డబ్బులకోసం కక్కుర్తి పడి మనుషులను కూడా ఎక్కించుకుంటారు. ఇంకా దయనీయం ఏమిటంటే కొన్ని చోట్ల పది సంవత్సరాల వయసు కూడా లేని బాలురు కూడా ద్విచక్రవాహనాలను అతివేగంగా నడుపుతుంటారు. సొంత వాహనాలను నడిపేటప్పుడు అవసరం లేకపోయినా పెద్ద సౌండ్ తో హారన్ మోగిస్తూ రోడ్డు మీద నడిచేవారు తమ వాహనాలను చూడాలనే కోరికతో పాదచారులు డిస్టర్బ్ చేస్తుంటారు. చాలా వాహనాలకు రవాణాశాఖవారు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉండవు. పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉండవు. మరీ ఘోరం ఏమిటంటే చాలా నగరాల్లో, పట్టణాల్లో ఆపొసిట్ డ్రైవింగ్ చేస్తుంటారు కొందరు. యూ టర్న్ దాకా వెళ్తే ఇంధనం ఖర్చు అవుతుందనే పిసినారితనంతో రాంగ్ రూట్లో వెళ్లారు. పోనీ, రాంగ్ రూట్లో స్లోగా వెళ్తారా అంటే అలా కాదు. రాంగ్ రూట్లో కూడా ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ వాహనదారులను భయానికి గురి చేస్తారు. మరికొందరైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్రలైట్ వెలుగుతున్నా ఖాతరు చెయ్యకుండా బర్రున వెళ్ళిపోతారు. పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో రోడ్డు మీద అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతారు. కాదు రెండు కాదు…ఎన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించవచ్చో అన్నిరకాలుగా ఉల్లంఘిస్తారు. అదేదో తమ జన్మహక్కుగా భావిస్తారు. అలా నిబంధనలు ఉల్లంఘించవద్దు అని ఎవరైనా చెబితే తమ అహం దెబ్బతిన్నట్లు ఫీల్ అవుతారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్కోసారి విలువైన ప్రాణాలను కూడా కోల్పోవలసి వస్తుంది. అప్పుడు పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడంలేదని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు దారిలో ఎక్కడైనా కనిపిస్తే వారిని తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో రోడ్డు మీద నడిచే మనుషులనో, ముందు వెళ్లే వాహనాలనో గుద్దేస్తారు. ఒకవేళ పోలీసులు ఆపితే కొందరు వారికి యాభయ్యో, వందో ఇచ్చి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కొందరు పోలీసులు ఆశ పడి వారిని వదిలేస్తారు. ఇదే వాహనదారులకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే చాలామంది పోలీసులు విధినిర్వహణలో కఠినంగా ఉంటారు. అలాంటివారిని ఉల్లంఘనులు ముందుగా బెదిరించడానికి ప్రయత్నిస్తారు. ఫలానా ఎమ్మెల్యే మాకు తెలుసు, ఫలానా మంత్రిగారి మనుషులం అంటూ పోలీసులను హెచ్చరిస్తారు. అయినప్పటికీ పోలీసులు బెదరకుండా చలానా రాస్తారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో వాహనాన్ని సీజ్ చేస్తారు.
ఇక జరిమానాల పెంపుదల విషయానికి వస్తే చాలామంది వైసిపి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని శాపనార్ధాలు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రతిపక్షాల ఆరోపణలకు కొందరు సొంత పార్టీలోనే సహకారం అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుకాడే అవకాశం కనిపించడం లేదు. జరిమానాలు భారీవా కావా అన్న విషయం తేల్చడానికి మనకేమి హక్కుంది? ఒకరికి రెండు వందల రూపాయలైనా భారీగా అనిపిస్తే కొందరికి రెండువేలయినా ఆఫ్టరాల్ అనిపిస్తుంది. ఏ జరిమానాలు విధించినా ఉల్లంఘనులకే తప్ప నిబంధనలు పాటించేవారికి వెయ్యరు కదా? వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గరుండి నిబంధనలు పాటిస్తే జరిమానాలు ఎందుకు వేస్తారు? పోలీసులు, రవాణాశాఖ అధికారులు వేధిస్తారు అని భయపడితే అర్ధం మనం నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదనే అర్ధం. కొన్ని కొన్ని దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలు వాహనం ఖరీదు కన్నా ఎక్కువ ఉంటాయట. అలాంటి సందర్భాల్లో యజమానులు తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారట! ఇంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి నిబంధనలు గాలికి వదిలేయాలని, తమకు సర్వస్వతంత్రం ఉండాలని కాంక్షించే ఆలోచనావిధానం కలిగిన మనదేశంలో రోడ్డు ప్రమాదాలు అధికం కాకుండా ఎలా ఉంటాయి? ప్రతిరోజూ వాహనప్రమాదాల్లో సుమారు అయిదు వందలమంది మరణిస్తున్నారట. కుటుంబాన్ని పోషించే వాడు మరణిస్తే ఆ కుటుంబం గతి ఏమవుతుంది? లక్షల రూపాయలు ఖర్చు చేసి పాతికేళ్ళు అహోరాత్రాలు చదువుకుని, రేపో మాపో విదేశాలకు వెళ్లబోయే ఒక యువకుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబసభ్యులు ఎంతటి నరకయాతన అనుభవిస్తారు!
మనవాళ్ళు ఎప్పుడైనా సింగపూరో, హాంగ్ కాంగో, అమెరికానో, లండనో వెళ్లి అక్కడ రోడ్ల మీద ఉమ్మేయాలన్నా, జీబ్రా మార్కు లేని చోట రోడ్డు క్రాస్ చెయ్యాలన్నా, ఇంట్లోని చెత్తను రోడ్డు మీద పడెయ్యాలన్నా గజగజ వణికిపోతారు. ఎందుకంటే ఆ దేశాల్లో అవి చాల పెద్ద నేరాలు. కానీ, మనదేశంలో ఏదీ నేరం కాదు. మన ఉల్లంఘనలను ఎవరైనా నేరం అంటే వారిమీద యుద్ధానికి సిద్ధం అవుతాము. ప్రభుత్వం సవరించిన జరిమానాలు ట్రాఫిక్ ఉల్లంఘనలు నివారించడానికి ఏమాత్రం సరిపోవు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడం, ప్రమాదానికి గురిచేసి ఎవరివైనా ప్రాణాలు పోవడానికి కారణం అయితే దాన్ని హత్యానేరంగా పరిగణించి ఉరిశిక్ష విధించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే సెల్ ఫోన్ ను అక్కడే ధ్వంసం చెయ్యడం, సరైన పత్రాలు లేకుండా రోడ్డు మీదకు వస్తే వాహనం ఖరీదును జరిమానాగా నిర్ణయించడం లాంటి కఠినమైన శిక్షలు అమలు చెయ్యాలి. ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలి.
చివరగా అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే కేవలం గేర్లు మారుస్తూ, స్టీరింగ్ తిప్పడమే డ్రైవింగ్ అనిపించుకోదు. డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రమాదాలను అదుపుచెయ్యగల మెళకువలను ఆకళింపు చేసుకోవాలి. లంచాలు తీసుకుని లైసెన్స్ లు ఇచ్చే విధానాన్ని నిర్దాక్షిణ్యంగా నియంత్రించాలి. రవాణాశాఖ, పోలీసు శాఖలోని అవినీతిపరుల భరతం పట్టాలి. అప్పుడే “భరత్ అనే నేను” అనిపించుకోవచ్చు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు