అ(త)ప్పులో కాలేసిన బాబు… ఏపీలో ప్రతీ ఒక్కరిపైనా ఎంత అప్పంటే..?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పలు శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి పూర్తిగా వాస్తవానికి దూరంగా ఉంటున్నాయని.. అవి వైట్ పేపర్స్ కాదు తప్పుడు పేపర్స్ అంటూ ఫైర్ అయిన జగన్ ప్రెస్ మీట్ పెట్టి వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన మాటలు, నేడు అసెంబ్లీలో చెప్పిన దానికీ పొంతనలేదు సరికదా.. జగన్ చెప్పిన మాటలు ఆర్బీఐ చెప్పిన వాటికి, చంద్రబాబు ఏపీలో ప్రతీ ఒక్కరిపైనా ఉన్న అప్పు పరంగా చెప్పినదానికీ సరిపోవడం గమనార్హం. దీంతో… చంద్రబాబు అప్పు పేరు చెప్పి తప్పులో కాలేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీలో చంద్రబాబు ఆర్థిక వ్యవహారాల మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో జగన్ ని తూర్పార పట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో తొమ్మిది లక్షల 74 వేల కోట్లు అప్పు అయినట్లుగా చూపించారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన ఏపీ అప్పు 14 లక్షల కోట్లు!

ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక స్వయంగా ఆయనే… సాక్ష్యాత్తు అసెంబ్లీలో ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో తొమ్మిది లక్షల 74 వేల కోట్ల అప్పు అని అంటున్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలే కాదు.. విమర్శలు కూడా అసత్యాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అంతే కాదు ఏపీలోని ప్రతీ ఒక్కరి మీద తలసరి అప్పు ఒక లక్షా 44 వేల 336 అని బాబు చెప్పారు. అయితే ఏపీలో జనాభా కాస్త అటూ ఇటూగా 5 కోట్లు అనుకుంటే… 5 కోట్లు ఇంటూ రూ.1,44,336 అని లెక్కిస్తే మొత్తం అప్పు 7 క్షల 21 వేల కోట్ల చిల్లర! ఇలా బాబు తన నోటితోనే మూడు రకాల అప్పుల లెక్కలు చెబుతుండటం విమర్శలపాలవుతుంది.

ఎన్నికల్లో 14 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం చేసి.. ఇప్పుడు అదే అప్పును 5 ల‌క్షల కోట్లకు త‌గ్గించి.. శ్వేతపత్రంలో ఆయనే 9 లక్షల 74 వేల కోట్లు అని చూపించి.. అదే శ్వేతపత్రంలో ఏపీలో ఒక్కొక్కరిపైనా లెక్క చెప్పి దాన్ని 7 లక్షల 21 వేల కోట్లుగా తేల్చారన్నమాట. ఇలా బాబు మార్కు లెక్కలు చూపించడంతో.. విమర్శలు వస్తున్నాయి.

ఇక చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి గణాంకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా… త‌మ హ‌యాంలో వాస్తవ అప్పు 5.18 ల‌క్షల కోట్లేన‌ని.. ఇత‌ర కార్పొరేష‌న్లు, సంస్థల నుంచి తీసుకున్న అప్పులు క‌లిపితే.. 7.14 ల‌క్షల కోట్లకు మించ‌ద‌ని వెల్లడించారు.

ఇక ఇటీవ‌ల బ‌డ్జెట్ ప్రక‌టించిన మ‌ర్నాడే నిర్మలా సీతారామ‌న్‌.. రాజ్యస‌భ‌లో అడిగిన ఓ ప్రశ్నకు స‌మాధానంగా ఏపీ అప్పులు రూ.4.52 ల‌క్షల కోట్లు ఉన్నాయ‌ని చెప్పారు. దీనికి ముందు.. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక‌లో కూడా 4.52 ల‌క్షల కోట్లు అప్పులు చూపించింది. ఇత‌ర మార్గాల్లో చేసిన అప్పుల‌ను కూడా పేర్కొంటూ.. అవి 2.87 ల‌క్షల కోట్లని చెప్పారు.

అంటే.. మొత్తంగా 7.39 ల‌క్షల కోట్ల రూపాయ‌లుగా ఉంది. ఇది కేంద్రం చెబుతున్న లెక్క. ఈ లెక్క జ‌గన్ చెబుతున్న 7.14 ల‌క్షల కోట్లకు దాదాపుగా దగ్గరగా, సమానంగా ఉంది. మరి బాబు ఎన్నికల్లో చెప్పిన 14 లక్షల కోట్లు అని చెప్పింది నిజమా.. శ్వేతపత్రంలో 9.74 లక్షల కోట్లని శ్వేతపత్రంలో చెప్పింది నిజమా?

అదీ గాకపోతే… ఒక్కొక్కరి తలపై ఉన్నట్లు చెబుతూ జగన్ తో ఏకీభవిస్తున్నట్లు ఉన్న 7.21 లక్ష కోట్లు నిజమా? బాబుకే తెలియాలి! ఏపీ ప్రజానికం గమనించాలి!!