క్రికెటర్ అంబటి రాయుడు, ఇటీవల క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంబటి రాయుడు, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే, ఏపీ నుంచే అంబటి రాజకీయ ప్రయాణం ప్రారంభమవ్వొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
వైసీపీ ఆయనకు గాలమేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా అంబటి రాయుడితో చర్చలు షురూ చేసిందట. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే అంబటి తిరుపతి రాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అంబటి రాయుడు నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటనా రాలేదు.
క్రికెట్ సంబంధిత వ్యవహారాల్ని ముఖ్యమంత్రితో అంబటి తిరుపతి రాయుడు చర్చించాడట. ఏ సాయం ప్రభుత్వం తరఫు నుంచి కావాలన్నా అందిస్తామని ముఖ్యమంత్రి ఆయనకు భరోసా ఇచ్చారట.
ఇదిలా వుంటే, నర్సాపురం లోక్ సభ నుంచి అంబటి తిరుపతి రాయుడు పోటీ చేస్తారంటూ ఓ గాసిప్ షురూ అయ్యింది. కానీ, అలా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ‘క్షత్రియ’ కమ్యూనిటీ నుంచి మాత్రమే అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశముందక్కడ. ఆ స్థాయిలో ఈక్వేషన్స్ గట్టిగా వుంటాయ్.
గతంలో నాగబాబు జనసేన నుంచి పోటీ చేశారు కదా.? అంటే, అది వేరే చర్చ. ఒకవేళ నర్సాపురం లోక్ సభ కాకపోతే, భీమవరం నుంచి అంబటి రాంబాబు పోటీ చేయొచ్చన్నది ఇంకో గాసిప్. ఇది కూడా నిజం కాదు. అంబటి అంటూ పోటీ చేస్తే, గుంటూరు జిల్లా నుంచే చేయొచ్చు.