టిడిపి-కాంగ్రెస్ పొత్తు : కొందరు టిడిపి నేతల్లో గుబులెందుకంటే…

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

తెలుగుదేశం పార్టీ నేతలు కొందరిలో గుబులు మొదలయింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర ప్రయోజనం ఒకగూరు తుందని భావించి  ఒక నిర్ణయం అనుకుంటే దానిని అమలుచేసి తీరతారు. దీనికి ఆయన బిజెపితో పెట్టుకుని ఎన్  డి ఎ ప్రభుత్వంలో చేరడమే సాక్ష్యం.  ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ని తొలినుంచి  సెక్యులర్ పార్టీగా చెప్పకుంటూ వచ్చారు. అందువల్ల బిజెపితో పొత్తు పెట్టుకోవడమేమిటనే ప్రశ్నవచ్చింది ఆరోజుల్లో.

అపుడు తెలుగుదేశం అధినేత చెపిందేమిటో గుర్తుందా? ‘ ఇపుడుకూడా తెలుగుదేశం పార్టీ సెక్యులరీ పార్టీయే. ఇక ముందు కూడా సెక్యులర్ పార్టీగానే ఉంటుంది. కాకపోతే, ప్రజలు బిజెపికి అనుకూలంగా తీర్పిచ్చారు. దీనితో మేం ఇష్యూబెస్డు గా బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వానికి మద్దతు నిస్తాం,అంతేగాని సెక్యులర్ ప్రిన్సిపుల్స్ తో రాజీపడం,’ అని ప్రకటించారు. దీనికి తగ్గటుగానే బిజెపి అయోధ్య ఇష్యూ తో పాటు మరికొన్ని వివాదాస్పద అంశాలను పక్కన బెట్టింది. అదే పొత్తును ఆయన 2017 దాకా కొనసాగించారు. మొదట్లో టిడిపి-బిజెపి పొత్తు ను వ్యతిరించిన వారంతా దారికొచ్చారు. చివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలంతా కూడా చంద్రబాబు నాయుడిని సమర్థించారు. వ్యతిరేకించి బయటకు వెళ్లింది ఒక బాబూఖాన్ మాత్రమే. బిజెపితో కలవడమైనా, బిజెపిని వదిలేయడమైనా ఆయన అందరిని ఒప్పించగలరు. ఎవరి బెదిరింపులకు చంద్రబాబు నాయుడు బెదరరు. పార్టీలో ఉంటే ఉండవచ్చు. లేదా పోవచ్చు.నిజానికి బషీరుద్దీన్ బాబూఖాన్ బాగా నిజాయితీ ఉన్ననాయకుడు. ఆయన పార్టీ పాలసీని వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీని ఎన్ డిఎ లో చేర్చి కేంద్రంనుంచి చాలా ప్రయోజనం సాధించారు చంద్రబాబునాయుడు. అది నెరవేరడం లేదని తెలుస్తూనే ఆయన గుడ్ బై కూడా చెప్పారు.

ఇపుడాయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవలసిన సమయం వచ్చింది. పార్టీనేతలను, ప్రజలను ఒప్పించడానికి, మెప్పించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతారు.

అలాంటపుడు ఉప ముఖ్యమంత్రి  కెయి కృష్ణమూర్తి, మరొక మంత్రి అయ్యన్న పాత్రుడు చాలా గట్టిగా స్పందించారు. కెయి కృష్ణమూర్తయితే, టిడిపి కాంగ్రెస్ తో కలిస్తే వురేసుకుంటానన్నారు.  ముఖ్యమంత్రి ఆలోచనలు పూర్తిగావెల్లడికాకముందే వీరిలా తీవ్రంగా స్పందించడం వెనక కారణమేమయి ఉంటుంది. ఒకపుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉండేది. జాతీయ స్థాయిలో దానికి పోటీయే లేదు.  అపుడు దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. అలాంటపుడు తెలుగుదేశం ఫిలాసఫీ కాంగ్రెస్ వ్యతిరేకంగా తయారయింది. ఇపుడు కాంగ్రెస్ రాష్ట్రంలో లేనే లేదు. కేంద్రంలో కూడా లేనట్లే. ఇలాంటి కాంగ్రెసే మన ప్రధానశత్రువు అనాలని కెయి, అయ్యన్నలు అంటున్నారు. ఈ వాదనలో పసలేదు.

ఎవరితో పొత్తు అనేది వ్యక్తుల ప్రయోజనాలమీద, పార్టీ , రాష్ట్ర ప్రయోజనాలను బట్ట ఉండాలి. కాంగ్రెస్ ఇపుడు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ప్రమాదకరమయిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఆ పార్టీకి లేదు. సరిగదా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అంతో ఇంతో చేయూత నివ్వ గల శక్తి ఇపుడాపార్టీకి ఉంది. దానిని వద్దంటే ఎలా?

అయ్యన్న పాత్రుడు సరే, వురేసుకుంటానని ఉప ముఖ్యమంత్రి కెయి బెదిరించడమేమిటి?

 

దీనికి కారణం ఉంది.

 

తెలుగుదేశం, కాంగ్రెస్కు పొత్తు అంటే, కర్నూలు జిల్లాలో కెయి రాజకీయ ప్రత్యర్థి కుటుంబమయిన కోట్ల కుటుంబానికి మళ్లీ వూపిరి పోసినట్లువుతుందని ఉపముఖ్యమంత్రి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కోట్ల చనిపోయాక, కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో రాష్ట్రంలో పవర్ పోయాక, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయాక , కెయి కుటుంబానికి ఇక ప్రత్యర్థి లేకుండా పోయారు. ఇలాంటపుడు, కాంగ్రెస్ ఒకటో రెండో సీట్లు గెలుచుకునేందుకు  తెలుగుదేశం పొత్తు పేరుతో సహకరించాల్సి వస్తుంది. ఒక వేళ అది కర్నూలు పార్లమెంటులో సీటో లేక పత్తికొండ లేదా డోన్ అసెంబ్లీ సీటో అయితే ఎలా?

పొత్తు కోట్లసూర్య ప్రకాశ్ రెడ్డి లోక సభకు పోటీ చేసే అవకాశం ఉంది. లేదంటే ఆయన భార్య సుజాతమ్మ అసెంబ్లీకి పోటీ చేయవచ్చు. ఇద్దరిలో ఒకరు గెల్చినా, చనిపోతున్న పాముకు చికిత్స చేసి బతికించినట్లువుతందని కెయి ఆందోళన చెందుతూ ఉండవచ్చు.

పొత్తుపేరుతో పదో ఇరవైయ్యో సీట్లను టిడిపి అధినేత కాంగ్రెస్ కు ఇస్తే కొంతమంది టిడిపి శాసన సభ్యులు లేదా టికెట్ ఆశిస్తున్నవారు  త్యాగం చేయాల్సి రావచ్చు.

తెలుగుదేశం పార్టీలో ఈ ఆందోళన మొదలయింది. వాళ్లే ఇపుడు పసలేని వాదన లేవనెత్తతున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టడమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. మరలాంటపుడు అదే కాంగ్రెస్ తో పొత్తేమిటన్నది వాళ్ల వేస్తున్న చద్ది ప్రశ్న.

ఇది ఎపుడో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉన్నప్పటి మాట. అంటే దాదాపు గత జన్మలో సంగతి.   1982 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎన్ని జన్మలెత్తిందో. ఇందిరాగాంధీ పోయారు. రాజీవ్ వచ్చారు. దానితో కాంగ్రెస్ శకం అంతరించింది. కాంగ్రెస్ యుపిఎ స్థాయికి కుంచించుకపోయింది. ఇపుడు జాతీయ స్థాయిలో ఎక్కడా బలంగా లేని చిన్న పార్టీ అయిపోయింది. ఇలాంటపుడు కూడా పాత పీడకలలు నెమరేసుకుని భయపడితే, ప్రత్యర్థికి అవకాశమిచ్చినట్లే. తెలుగుదేశం పార్టీకి  పార్టీ మనగడ, రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. పార్టీ రాజ్యాంగాలు ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. దీనికోసం పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకుంటే తప్పులేదు. సమయం వచ్చినపుడు తలరాతలు కూడా తిరగరాసుకోవాలి. సర్వైవల్ ఆప్ ఫిట్టెస్టు అంటే… అదే. అలాంటి పార్టీలే బతుకుతాయి. లేకపోతే, కమ్యూనిస్టుల్లాగా అంతరించిపోవలసి వస్తుంది.

అయితే, టిడిపి- కాంగ్రెస్ పొత్తు వల్ల తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తగ్గిపోతాయనుకునే వాళ్లు  బాగా గొడవచేసే అవకాశం ఉంది.  కొంతమంది రాజీనామా చేసి వైపిపికో, జనసేనకో, లేదా బిజెపిలోకో వెళ్లిపోవచ్చు. ఈ అశాంతిని చంద్రబాబు నాయుడు ఎలా ప్రశాంత పరుస్తారో చూడాలి.