అనకాపల్లి పాలిటిక్స్… సీఎం రమేష్ కు “చింతకాయల” “దాడి” టెన్షన్!

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లోని నేతల పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఇద్దరు కృష్ణులు ఉండగా.. ఎక్కడి నుంచో తెచ్చి మూడో కృష్ణుడిని కూర్చోబెట్టేసరికి.. ఆ ఇద్దరితోనూ ఎలా మెలగాలి, ఎవరిని ఎక్కువగా కలుపుకున్నా మరొకరికి మంట. ఎవరికి తక్కువ చేసినా తాట ఊడిపోయే పరిస్థితి! ప్రస్తుతం అనకాపల్లిలో సీఎం రమేష్ కు చుట్టూ టెన్షన్ వాతావరణమే అని అంటున్నారు!

ఇడుపులపాయ వేదికగా 175 అసెంబ్లీ, 24 లోక్ సభ నియోజకవర్గాలకు టిక్కెట్లు ప్రకటించిన జగన్.. అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ ను మాత్రం ప్రకటించలేదు. కూటమిలో భాగంగా అక్కడ ఏ పార్టీకి టిక్కెట్ దక్కుతుంది, ఎవరు పోటీ చేస్తారు అనే విషయాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే.. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా టిక్కెట్ కేటాయించాలని భావించారు. దీంతో… బీజేపీ నుంచి సీఎం రమేష్ కి టిక్కెట్ దక్కడంతో.. బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించారు జగన్.

ఈ సమయంలో… వైసీపీకి అనకాపల్లిలో ఉన్న అనుకూలత కలిసివస్తోందనేది జగన్ వ్యూహాల్లో ఒకటని తెలుస్తుంది. ఇదే క్రమంలో బూడి ముత్యాల నాయుడు 2014, 2019లలో రెండు సార్లు మాడుగుల సీటుని వరసగా గెలిచారు. అప్పటివరకూ టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటుని ఆయన వైసీపీ పరం చేశారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడికి.. జిల్లాలో పలుకుబడి బాగా ఉండటంతోపాటు, వివాదరహితుడిగానూ, అవినీతికి దూరంగా ఉండే నేతగాను, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నాయకుడిగానూ పేరుంది.

ఇలాంటి స్థానికంగా బలమైన నేతను ఓడించాలంటే కడప నుంచి వచ్చి అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఏస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఆస్కతిగా మారింది. కారణం… గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెడితే… సీఎం రమేష్ కు అనకాపల్లిలో ప్రధానంగా నాలుగైదు సమస్యలు ఉన్నాయని, అవే కీలకమని అంటున్నారు పరిశీలకులు.

అందులో ప్రధానంగా సీఎం రమేష్ ప్రత్యర్థి బూడి ముత్యాల నాయుడు స్థానికుడు. అనకాపల్లి ప్రజలకు ఈ ఫీలింగ్ మిగిలినవాటికంటే ఎక్కువ! పైగా సౌమ్యుడే తప్ప పొగరు, అహంకారం ఉనన్ నేత కాదు! పైగా అవినీతి రహితుడు అనే పేరుంది!! ఆ సంగతి అలా ఉంటే… అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ ను టీడీపీ నుంచి ఆశించిన ఇద్దరు స్థానిక బలమైన నేతలు ఉన్నారు. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకోవడం సీఎం రమేష్ ముందున్న పెద్ద టాస్క్ అని చెబుతున్నారు.

అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ తన కుమారుడికి దక్కాలని మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఆయన కుమారుడికి టిక్కెట్ దక్కలేదు. ఇదే సమయంలో దాడి వీరభద్రరావు తన కుమారుడికి అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేయడం, తీరా టిక్కెట్ దక్కకపోవడం తెలిసిందే. దీంతో… ఇప్పుడు ఈ ఇద్దరి నేతల సహకారంఏ సీఎం రమేష్ కు అత్యంత కీలకం. కారణం అనకాపల్లిలో బీజేపీ పరిష్తితి నోటకంటే తక్కువ!

దీంతో సీఎం రమేష్ తమ్ముడు సీఎం రాజేష్ ఇప్పటికే అనకాపల్లి చేరుకుని వర్క్ స్టార్ట్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన అనకాపల్లిలో ల్యాండ్ అయ్యీ అవ్వగానే అయ్యన్నపాత్రుడిని కలిశారు! అయితే.. తన సహకారం ఉంటుందని ఆయన చెప్పారై తెలుస్తుంది. ఇదే సమయంలో దాడి వీరభద్రరావుని కూడా కలిశారని.. ఆయన నుంచి కూడా ఇదే సమాధానం వచ్చిందని చెబుతున్నారు. సరే మాట అయితే వచ్చింది.. చేతల పనేమిటి అనే టెన్షన్ సీఎం రమేష్ బ్యాచ్ లో ఉందని అంటున్నారు.

అలా అని అయ్యన్నకు కీలక బాధ్యతలు ఇస్తే దాడితో సమస్య.. దాడిని నెత్తినపెట్టుకుంటే అయ్యన్నతొ ప్రాబ్లం అనేట్లుగా ఇప్పుడు అనకాపల్లిలో సీఎం రమేష్ పరిస్థితి ఉందని అంటున్నారు! మరి ఒకపక్క బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న దశలో.. ఈ టీడీపీ నేతలను ఎలా మచ్చిక చేసుకుంటూ నెట్టుకొస్తారనేది వేచి చూడాలి!