రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో ఊహించలేం. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల్ని, ఆంధ్రపదేశ్ రాజకీయాలతో పోల్చగలమా.? లేదా.? అన్నదానిపై స్పష్టత కొద్ది రోజుల్లోనే వచ్చేయబోతోంది. పంచాయితీ ఎన్నికలతో అన్ని లెక్కలపైనా స్పష్టత వచ్చేస్తుంది. ‘ఉద్యోగులు, ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టకుని పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో వద్దనుకున్నాం.. వ్యాక్సినేషన్ జరుగుతున్నందున పంచాయితీ ఎన్నికల వాయిదా కోరుతున్నాం..’ అని చెబుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జనాన్ని పెద్దయెత్తున పోగయ్యకుండా వుంటుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషనర్)గా వుండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించకూడదన్నది వైసీపీ ప్రభుత్వ ఆలోచన.
కానీ, కోర్టులు మొట్టికాయలేయడంతో పంచాయితీ ఎన్నికల బరిలోకి దూకక తప్పలేదు. ఇప్పుడు వైసీపీకి కరోనా నిబంధనలేమీ వుండవు. జనాన్ని పోగెయ్యడం ఖాయం. అయితే, అక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వున్నారు ఎస్ఈసీగా.. దాంతో, వైసీపీ పప్పులుడకడం అంత తేలిక కాదు. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించేసి పంచాయితీ ఎన్నికల్లో పై చేయి సాధించుదామనుకుంటే వైసీపీకి అది కుదరని పని. కానీ, విపక్షాలు.. అధికార పార్టీకి పోటీ ఇచ్చేంత బలంగా వున్నాయా.? అన్నదే అసలు ప్రశ్న. టీడీపీ గడచిన 18 నెలల్లో దారుణంగా నీరసించిపోయింది. జనసేన – బీజేపీ మధ్య అవగాహనా లోపం వుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రపదేశ్‌లో లేనే లేదు. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుండకపోవచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో, పంచాయితీ ఎన్నికలంటే.. రాజకీయ పరమైన ఈక్వేషన్ల కంటే స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అలా చూసుకుంటే మాత్రం, గ్రామాల్లో సమస్యలు.. అబివృద్ధి లేమి.. ఇవన్నీ అధికార పార్టీకి సమాధానం చెప్పుకోలేని అంశాలే అవుతాయి.