(సుంచు అశోక్)
ఇరవై అయిదేళ్ల ఉద్యమ ప్రయాణం.. ఎన్నో ఒడుదొడుకులు.. మరెన్నో ఆటుపోట్లు. ఈ సుదీర్ఘ జెర్నీలో అవమానాలు, అవహేళనలు ఒకవైపు, నిరాజనాలు, అభినందనలు మరోవైపు.. అయినా వెనుదిరకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నది ఎమ్మార్పీఎస్ (మాదిగ దండోరా). సామాజిక ఉద్యమాలు, కుల సంఘాలకు ఎమ్మార్పీఎస్ దిక్సూచిగా మారింది. ఎస్సీల్లోని 59 కులాలకు గాను ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 15 శాతం రిజర్వేషన్ల వినియోగంలో అసమానతలు ఉన్నాయని గుర్తించిన మహాజన నేత, సామాజిక సైంటిస్టు, ఇంజినీరింగ్ స్టూడెంట్ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ పురుడుపోసుకున్నది.
తొలుత కేవలం 20 మంది యువకులతో 25 ఏళ్ల క్రితం అంటే 1994 జూలై 7వ తేదీన ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి పునాదులు వేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఘట్టాలను ఎదుర్కొన్న చరిత్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఉంది. లక్ష్య సాధన కోసం వెనుకడుగు వేయకుండా తనదైన శైలిలో ఉద్యమ ఎత్తుగడలు, వ్యూహాలతో పాలక పక్షాలకు ముచ్చెమటలు పట్టించారు, పట్టిస్తూనే ఉన్నారు. ఒక వైపు ఎస్సీల్లోని అసమానతలను తొలగించడానికి వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు సమాజంలోని పేద వర్గాల కోసం పోరాటాలు నడిపి ఫలితాలు సాధించారు. ఒక వ్యక్తి పేరు పక్కన తన కులం పేరును పెట్టుకోవడం అగ్రవర్ణాలకు చెందిన కొన్ని కులాలకే పరిమితమయ్యేది. కులం పేరు చెప్పుకోవడం పెత్తందార్ల కులాలే కాదు మేం సైతం మా పేరు పక్కన కులం పేరును చేర్చుకుంటామని మంద కృష్ణ పేరు పక్కన మాదిగ అనే పదాన్ని చేర్చుకుని సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వరవడి సృష్టించారు. అణగారిన కులాలకు గౌరవాన్ని ఆపాదించి పెట్టారు.
పేద వర్గాలకు దేవుడిగా మంద కృష్ణుడు..
గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా ఆఫరేషన్ చేయించాలని 2004లో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మంద కృష్ణ. నాటి ఉద్యమం ఫలితమే అంతిమంగా ఆరోగ్య శ్రీ పథకానికి దారిసింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల పేద ప్రజలు ఆ పథకం కింద వైద్య సేవలు అందుకుంటున్నారంటే కారణం మంద కృష్ణ మాదిగే. 2014 ఎన్నికల ముందు సమాజంలోని బుక్కడు బువ్వకు నోచుకోకుండా అర్థాకలితో అలమటిస్తున్న వృద్ధులను చూసి చలించిపోయిన మంద కృష్ణ మాదిగ.. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం మరో సామాజిక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలను ఓకే వేదికపైకి తీసుకొచ్చి అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వేదికపైన ఉన్న రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం.. ఆ తర్వాత ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల పేదలు పేన్షన్లను పొందుతున్నారు. ఇక పోతే ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగుల్లో రిజర్వేషన్లలో ప్రమోషన్ల కోసం పోరాటం చేసి ఆ ఫలాలను ఉద్యోగులకు అందించారు.
ఎమ్మార్పీఎస్‌పై ఇద్దరు చంద్రుల కుట్రలు..
అంబేద్కర్ వాదిగా, సామాజిక తెలంగాణ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్ష సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రాని సమయంలో మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించి.. చివరకు కేసీఆర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసే వరకు వెన్నంటే ఉన్న చరిత్ర మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఆకలి కేకల పోరు కేక ‘ పేరుతో ఉద్యమం చేపట్టి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నాలుగు నుంచి ఆరు కిలోల బియ్యం అందేలా చేయడంలో ఎమ్మార్పీఎస్ పాత్ర మరువలేనిది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన పోరాట పంథాను ఎంచుకున్నారు కృష్ణ మాదిగ. ఇదే అంశం సీఎం కేసీఆర్‌కు కంటగింపుగా మారింది. ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని చీల్చడానికి కుట్రలు చేశారు. కొంత మేరకు విజయవంతమైనా.. విడిపోయిన వారితో ఊదు కాలదు.. పీరు లేవదు అన్నట్లుగా మారింది పరిస్థితి. రెండుసార్లు జైలుకు పంపడంతో పాటు నిండు అసెంబ్లిలో కేసీఆర్ మాట్లాడుతూ .. మంద కృష్ణ మాదిగ పని అయిపోయిందని, వర్గీకరణ మేమే సాధిస్తామని ప్రగల్బాలు పలికారు.. కానీ ఇప్పుడా ఆ ఊసే ఎత్తడం లేదు. అంతేకాదు మంద కృష్ణను ఉక్కుపాదంతో అణిచివేస్తామని కూడా హూంకరించారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వద్దాం. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం సమయంలో టీడీపీ నేతలకు తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు. అంతే కాకుండా చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ‘‘వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతాను.. మాదిగలు మద్దతివ్వండి’’ అంటూ కృష్ణ మాదిగ వద్ద చంద్రబాబు ప్రాధేయపడ్డారు. గతంలో వర్గీకరణ కోసం తీర్మానం చేసిన సందర్భం చంద్రబాబుకు ఉన్నందున.. సుప్రీం కోర్టులో టెక్నికల్ సమస్యతో కొట్టివేయబడిన వర్గీకరణ చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్రను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని, బాబు పాదయాత్రను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, టీజేఏసీ హెచ్చరిలు జారీ చేశాయి. చంద్రబాబు పాదయాత్రను మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నుంచి అదిలాబాద్ వరకు కంటికి రెప్పలా కాపాడుతూ ఎమ్మార్పీఎస్ ముందుండి నడిపించింది. ఆ తర్వాత మాట మార్చిన చంద్రబాబు వర్గీకరణ ఊసే ఎత్తకపోగా ఎమ్మార్పీఎస్ సభలకు కూడా ఏపీలో అనుమతి ఇవ్వలేదు. అంతేకాక మంద కృష్ణ మాదిగ తెలంగాణ వ్యక్తి అంటూ ఏపీ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ ఏపీ మాదిగలు మా నాయకుడు మంద కృష్ణ మాదిగనే అంటూ చంద్రబాబు పాలేర్లకు ఘాటైన హెచ్చరికలే జారీ చేశారు.
ఇక ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేపథ్యానికి వద్దాం.. సమాజానికి పూర్తిగా తెలియ జేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేసే 15 శాతం రిజర్వేషన్లలోని ప్రభుత్వ ఉద్యోగాలలో మాల, మాల ఉపకులాలకు చెందిన వారే ఎక్కువుగా అనుభవిస్తున్నరాని ప్రభుత్వ లెక్కల ప్రకారమే తేలింది. మాదిగ, మాదిగ ఉప కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరగాలంటే బీసీ జాబితాలో ఉన్న ఏబీసీడీ మాదిరిగానే ఎస్సీల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలనే డిమాండ్‌తోనే ఎమ్మార్పీఎస్ (మాదిగ దండోరా) ఆవిర్భావానికి కారణమైంది. వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో జాతి కోసం కొంత మంది అమరులైన సందర్భాలు కూడా ఉన్నాయి. మాలల చేతిలో కొందరూ హత్యలకు గురికాగా.. గాంధీభవన్ లో ఆందోళన చేసే క్రమంలో మరో ఇద్దరు యువకులు అమరత్వాన్ని పొందారు. మాదిగ వీరుల త్యాగానికి గుర్తుగా ఎమ్మార్పీఎస్ మాదిగ మృత వీరుల దినంగా ……. ప్రతి ఏటా పాటిస్తూ నివాళులు అర్పించి, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నది.
రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నది మంద కృష్ణ ఆశయం. అందుకోసమే 25 ఏళ్లపాటు నిర్విరామంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నారు. పాలక వర్గాలు అవసరమైనప్పుడే రిజర్వేషన్లకు మద్దతిస్తున్నట్లు నటిస్తున్నాయి. తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మట మాట్లాడుతూ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తన లక్ష్యం సిద్ధించేందుకు బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణంలో నిమగ్నమయ్యారు మంద కృష్ణ మాదిగ. బలమైన ప్రజా ఉద్యమం ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఆయన పదే పదే ఉద్బోధిస్తున్నారు.
* రచయిత : సుంచు అశోక్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్. (ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)