పింఛన్ల పెంపు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన ‘మహాగర్జన’ సన్నాహక సభలో మంద కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పొరుగు రాష్ట్రమైన ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల క్షీణత బాధితులకు రూ.15 వేల వరకు పింఛను అందిస్తోంది. కానీ తెలంగాణలో పింఛన్లు పెంచకపోవడం దారుణం,” అని విమర్శించారు.
ప్రభుత్వాలు కేవలం ఉద్యమాలు, పోరాటాల ద్వారానే స్పందిస్తాయని, ప్రజా పోరాటాలతోనే న్యాయం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, పింఛన్ల పెంపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ‘మహాగర్జన’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర పింఛన్‌దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, జిల్లా అధ్యక్షుడు సాయిలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


