ఎస్సీ వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయ్సథానం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని తమ తాజా తీర్పులో వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును… విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా స్పందించిన ఈజేఐ చంద్రచూడ్… వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదని.. వర్గీకరణ అనేది ఆర్టికల్ 341/2కి ఉల్లంఘన కాదని.. ఆర్టికల్ 15, 16లో వర్గీకరణ వ్యతిరేకించే అంశాలూ లేవని తెలిపారు.
ఇదే సమయంలో… దీనివల్ల ఎస్సీ, ఎస్టీలోని వెనుకబడిన ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడిందని తెలుస్తోంది! ఈ నేపథ్యంలోనే… ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని తెలుపుతూ… ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్ ను గుర్తించడానికి రాష్ట్రాలు.. ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.
ఇందులో భాగంగా… మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న ఆయన.. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని చెబుతూ… అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ చేసేలా చూసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ మంద కృష్ణ ఓ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా… వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని.. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. అయితే… ఈ విషయంలో ఇప్పటికే రేవంత్… ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మరోపక్క ఏపీలో చంద్రబాబు ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే విడుదలైన మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా బాబు ఈ తీర్పుకు, మంద కృష్ణ డిమాండ్ కూ కట్టుబడతారా.. కట్టుబడి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా.. లేక, తీర్పు వచ్చిన తర్వాత ఇచ్చే నోటిఫికేషన్స్ కి మాత్రమే దీన్ని అప్లై చేస్తారా అనేది వేచి చూడాలి.
ఇక ఈ తీర్పు అనంతరం… అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అటు బీఆరెస్స్ లతోపాటు టీడీపీ నుంచి కూడా క్రెడిట్ గేమ్ స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు. ఈ విషయంలో తమవల్లే ఇది సాధ్యమైందని అంటే.. తమ వల్లే అని చెప్పుకుంటున్నారని అంటున్నారు.