ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఎంతలా నష్టపోయిందో అందరికీ తెలుసు. అన్ని వాస్తవాలు తెలిసీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోసమంటూ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా గతంలో పనిచేసిన ఓ ప్రముఖుడు, మంత్రులుగా పనిచేసిన కొందరు నేతలు.. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో హల్‌చల్ చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం తొలుత నినదించిన ఈ నేతలంతా, ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం.. అంటూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.!
ఉత్తరాంధ్రదీ అదే వాదన.!
వెనుకబాటుతనం పేరెత్తితే తొలుత విన్పించే ప్రాంతం ఉత్తరాంధ్ర. నిజానికి, అన్ని వనరులూ వున్నా సరే, ఉత్తరాంధ్ర మీద రాజకీయ నాయకులు ‘శీతకన్నేశారు’ ఎన్నో దశాబ్దాలుగా. అలా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురయ్యింది. కాదు కాదు, ఉత్తరాంధ్రని రాజకీయ నాయకులే వెనక్కి నెట్టేశారు అభివృద్ధిలో. ఆ ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని ప్రకటించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. అయితే, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా.? అన్నదానిపై మళ్లీ భిన్న వాదనలున్నాయి.
రాయలసీమ వ్యధ వేరే వేంది.!
రాయలసీమది కథ కాదు.. వ్యధ. ఉత్తరాంధ్రలానే, రాయలసీమ కూడా వెనకబాటుతనానికి గురయ్యింది. ఉత్తరాంధ్ర కంటే ఘోరమైన పరిస్థితి రాయలసీమది. బోల్డంతమంది ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. విడిపోయాక కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ఇద్దరూ రాయలసీమకు చెందినవారే. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చిన వైఎస్ జగన్, కర్నూలుకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారు. కానీ, అభివృద్ధి దిశగా కర్నూలుపై ఇప్పటివరకూ ఫోకస్ పెట్టకపోవడం రాయలసీమ నేతల్లో అసహనాన్ని పెంచుతోంది.
తెలంగాణ ఉద్యమంతోపాటే, రాయలసీమ ఉద్యమం కూడా.!
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం కొందరు నేతలు నినదించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర.. అన్నారు. చివరికి సర్దుకుపోయారు. సీమకు చెందిన రాజకీయ నాయకులే, సీమ వెనకబాటుతనానికి కారణమన్నది సీమ ప్రాంత ప్రజల వాదన. విభజనతో తెలంగాణ బాగుపడింది.. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఈ ఈక్వేషన్స్‌ని గుర్తించి అయినా, రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర నినాదం చల్లారుతుందేమో చూడాలిక.