ఇంటింటికీ రేషన్ డోర్ డెలివరీ చేయాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 9 వేలకు పైగా వాహనాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంద్రపదేశ్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఓ వైపు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ, ఇంకోపక్క నిరుద్యోగులకు ఉపాధి అవకాశం.. ఇలా రెండు కోణాల్లో ఈ పథకాన్ని తెరపైకి తెచ్చింది వైఎస్ జగన్ సర్కార్. కానీ, రేషన్ తీసుకోడానికి, రేషన్ దుకాణాలకు వెళ్ళలేనంత నిస్సహాయ స్థితిలో జనం వున్నారా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఇంకోపక్క, రేషన్ డోర్ డెలివరీ వాహనాలు.. ఆయా వాహనాల్ని పొందిన నిరుద్యోగులకు ఎంతవరకు ఉపాధి కల్పిస్తాయన్నది ఇంకో చర్చ. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వాహనం నిర్వహణ కోసం 16,000 రూపాయల్ని ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది గతంలో. 10 వేలు అద్దె, 3 వేలు పెట్రోలు, 2 వేలు హెల్పర్ కోసం ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. అయితే, 2 వేల రూపాయలకి హెల్పర్ దొరకడం అసాధ్యమని వాహనాల్ని పొందిన నిరుద్యోగులు చెబుతున్నారు. ‘మాకు ఈ వాహనాలు వద్దు మొర్రో..’ అంటూ వాహనాల్ని పొందిన నిరుద్యోగులు తిరిగి,
ప్రభుత్వానికి ఆ వాహనాల్ని అప్పగించేస్తున్న దరిమిలా, మరో ఐదు వేల రూపాయల్ని అదనంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇక్కడా ఓ మెలిక పెట్టింది జగన్ సర్కార్. వాహనాల్ని శుభ్రంగా వుంచితేనే, అదనపు మొత్తం లభిస్తుంది. దీనికి తహసీల్దారు నుంచి సర్టిఫికేషన్ కావాల్సి వుంటుందట. వైసీపీ రంగులతో, ముఖ్యమంత్రి ఫొటోలతో కాకుండా, సాధారణ వినియోగం కింద కూడా ఉపయోగపడేలా వాహనాల్ని రూపొందించి వుంటే, వాటిని మిగతా రోజుల్లో ఇతరత్రా అవసరాల కోసం వినియోగించుకుని, తద్వారా అదనపు ఉపాది పొందడానికి ఆస్కారం ఏర్పడి వుండేదనీ, కేవలం ప్రభుత్వ మరియు పార్టీ ప్రచారం కోసం అన్నట్లుగా వాహనాలు తయారవడం ఇందులో పెద్ద మైనస్ పాయింట్ అన్నది లబ్దిదారుల ఆవేదనగా కనిపిస్తోంది. నెలకు 16 వేల రూపాయలైనా, 21 వేల రూపాయలైనా.. ఇదంతా ప్రజా ధనమే. రేషన్ దుకాణాలకే లబ్దిదారులు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటే ఆ మొత్తానికి ప్రభుత్వంపై భారం తగ్గుతుందనే చర్చ ఇప్పుడు బలంగా విన్పిస్తోంది. జగన్ సర్కార్ తెరపైకి తెచ్చిన సంక్షేమ పథకాల్లో రేషన్ డోర్ డెలివరీ.. అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.