Vastu Tips: ఇంట్లో రోజూ గొడవలేనా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు కారణం ఇదే..!

ఇంటి ప్రశాంతత ఒక్క మాటలో చెప్పాలంటే.. అది కనిపించని శక్తుల సమతుల్యత. అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించినా, ఇంట్లోకి అడుగుపెట్టగానే చిరాకు, చిన్న విషయాలకే మాటల యుద్ధాలు మొదలవుతున్నాయంటే.. కారణం మన కళ్లకు కనిపించని వాస్తు లోపాలే కావచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇంట్లో వస్తువులను అస్తవ్యస్తంగా ఉంచడం, దిశలను పట్టించుకోకపోవడం కుటుంబ వాతావరణంపై నెమ్మదిగా కానీ తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం కేవలం తలుపు మాత్రమే కాదు.. అది సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన మార్గం. అలాంటి ద్వారం దగ్గర బూట్లు, విరిగిన వస్తువులు, పనికిరాని సామాన్లు పేరుకుపోతే శుభ శక్తి అడ్డంకులకు గురవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. తలుపు ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురు చొచ్చుకుపోయేలా ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, అవకాశాలు సహజంగానే పెరుగుతాయట.

వంటగది విషయానికి వస్తే, అది కుటుంబ శక్తికి కేంద్రబిందువు. రోజూ అక్కడ తయారయ్యే ఆహారంతో పాటు శక్తి కూడా ఇంటి సభ్యులపై ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం. వంటగదిలో విరిగిన పాత్రలు, అవసరం లేని సామాన్లు నిల్వ చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శుభ్రంగా, చక్కగా ఉండే వంటగది కుటుంబంలో సానుకూలతను నిలబెడుతుందన్నది వాస్తు శాస్త్రం చెబుతోంది.

నిద్రపోయే పడకగది కూడా కుటుంబ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుంది. మంచాన్ని గోడకు ఆనించి ఉంచి, తల ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉండేలా చూసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది. దీని ఫలితంగా ఒత్తిడి తగ్గి, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇక బాత్రూమ్, వాటర్ ట్యాంక్ లాంటి నీటితో సంబంధం ఉన్న ప్రదేశాలు సరైన దిశలో లేకపోతే ఆరోగ్య సమస్యలు, మానసిక అస్థిరతలు తలెత్తే అవకాశం ఉందట. అందుకే వీటి స్థానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్నచిన్న మార్పులే పెద్ద ప్రశాంతతకు దారితీస్తాయని వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఇంట్లో శాంతి కావాలంటే.. మొదట ఇంటి ఏర్పాట్లనే సరిచూడాలన్నది నిపుణుల మాట.