చలికాలం మొదలవుతుందంటేనే జలుబు, దగ్గు, జ్వరం అంటూ ఆరోగ్య సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. శరీర రోగనిరోధక శక్తి తగ్గే ఈ సీజన్‌లో ఆహారంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రకృతి మనకు ఇచ్చిన ఉత్తమమైన వరం క్యారెట్. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ కూరగాయలో ఆరోగ్యాన్ని కాపాడే శక్తి దాగి ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో విస్తారంగా లభించే క్యారెట్ రుచిలో తియ్యగా ఉండటమే కాదు, శరీరానికి అవసరమైన కీలక పోషకాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ఏగా మారి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతాయి.
ప్రతిరోజూ క్యారెట్ తీసుకోవడం వల్ల చలికాలంలో ఎక్కువగా ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరగడంతో పాటు అలసట కూడా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది సురక్షితమైన సహజ రక్షణగా పనిచేస్తుంది. చలితో పొడిబారిపోయే చర్మానికి కూడా క్యారెట్ మంచి పరిష్కారం. ఇందులోని పొటాషియం చర్మంలో తేమను నిలుపుతూ సహజమైన మెరుపును అందిస్తుంది. రోజూ క్యారెట్ తీసుకునే వారికి చర్మం కాంతివంతంగా కనిపించడమే కాకుండా మొటిమలు, మచ్చలు కూడా క్రమంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక గుండె ఆరోగ్య విషయానికి వస్తే, క్యారెట్‌లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించే గుణం ఉండటంతో గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా క్యారెట్ మంచి ఎంపికగా నిలుస్తుంది. క్యారెట్లను రోజూ పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇలా తీసుకుంటే ఫైబర్ పూర్తిగా లభిస్తుంది. జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు కానీ చక్కెర కలపకుండా తాగడం మంచిది. చిన్న అలవాటు అయినా, చలికాలంలో రోజూ క్యారెట్ తినడం ద్వారా ఆరోగ్యాన్ని పెద్దగా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
