వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు ఇంటి వాతావరణాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలుగా భావిస్తారు. అందుకే చాలామంది మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకుంటూ సంపద, శుభఫలితాల కోసం ఆశపడుతుంటారు. కానీ వాస్తు నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. మనీ ప్లాంట్‌కు మించిన ప్రభావం చూపే మరో ప్రత్యేకమైన మొక్క ఉందట. అదే క్రాసులా జేడ్ మొక్క.
ఇటీవల వాస్తు, ఫెంగ్ షుయ్ నిపుణుల మధ్య ఎక్కువగా చర్చకు వస్తున్న ఈ క్రాసులా జేడ్ మొక్కను సిరిసంపదలకు సంకేతంగా భావిస్తున్నారు. చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కేవలం అలంకార మొక్క మాత్రమే కాదు.. ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చే శక్తివంతమైన ప్రతీక. ఇంట్లో ఈ మొక్కను నాటుకుని సంరక్షిస్తే క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గి, ఆదాయ మార్గాలు విస్తరిస్తాయని నమ్మకం.
ప్రత్యేకంగా ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారికి ఈ మొక్క ఎంతో శుభప్రదంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. క్రాసులా మొక్క ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసి, సానుకూల వాతావరణాన్ని పెంచుతుందని విశ్వాసం. అందుకే వ్యాపార కార్యాలయాల్లో, దుకాణాల్లో కూడా ఈ మొక్కను ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసులా జేడ్ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున ఉంచడం అత్యంత మంచిదిగా చెబుతారు. ఇది ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తిని బలపరిచి సంపదను ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ మొక్కను సంరక్షించడం కూడా చాలా సులభమే. ఎక్కువ నీరు అవసరం లేదు. కానీ ఆకులపై దుమ్ము చేరకుండా తరచూ శుభ్రం చేయాలి. తగినంత సూర్యకాంతి అందేలా చూసుకుంటే ఈ మొక్క మరింత శక్తివంతంగా మారుతుందని చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పచ్చదనం ఉండటం కేవలం సంపదకే కాదు.. మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో అవసరం. క్రాసులా లాంటి మొక్కలు గాలి శుద్ధి చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించి ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని తీసుకువస్తాయని నిపుణుల అభిప్రాయం. అందుకే ఇప్పుడు చాలామంది సంప్రదాయ మనీ ప్లాంట్‌కు బదులు ఈ ప్రత్యేకమైన క్రాసులా జేడ్ మొక్క వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంటి వాతావరణాన్ని మార్చే చిన్న ప్రయత్నమే.. పెద్ద సానుకూల మార్పులకు కారణమవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
