భారతీయ సంప్రదాయాల్లో ప్రతి చిన్న ఆచారానికి ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు పెద్దలు “ఇది తిని వెళ్లు” అని చెప్పడం వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు.. శాస్త్రం, ఆయుర్వేదం, మానసిక శాస్త్రం కలిసిన అనుభవజ్ఞానం ఉందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలైనా, ఇంటర్వ్యూలైనా, వ్యాపార ఒప్పందాలైనా.. ఇంటి తలుపు దాటి అడుగు పెట్టే ముందు తీసుకునే ఆహారం మన మనోస్థితిపై ప్రభావం చూపుతుందట.
జ్యోతి నిపుణులు చెబుతున్న ప్రకారం, ఈ సంప్రదాయాలు మన ఆలోచనలను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందులో ముఖ్యంగా పెరుగు–చక్కెర. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం యాదృచ్ఛికం కాదు. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తే, చక్కెర తక్షణ శక్తిని ఇస్తుంది. జ్యోతిష్య పరంగా చంద్రుడితో అనుసంధానమైన పెరుగు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని విశ్వాసం. అందుకే ముఖ్యమైన పని ముందు పెరుగు–చక్కెర తీసుకుంటే టెన్షన్ తగ్గి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారని చెబుతారు.
ఇదే కాకుండా, వారంలో ప్రతి రోజుకి ఒక గ్రహాధిపతి ఉంటాడని, ఆ గ్రహానికి అనుకూలమైన పదార్థాన్ని తింటే ఆ రోజు పనులు సాఫీగా సాగుతాయని నిపుణుల అభిప్రాయం. ఆదివారం సూర్యుడి రోజు కావడంతో, తమలపాకు నమిలితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. మంగళవారం అంగారకుడి ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. బెల్లం తినడం వల్ల శక్తి, ధైర్యం పెరుగుతాయని నమ్మకం. బుధవారం బుధ గ్రహానికి చెందినది. కొద్దిగా ధనియాలు తీసుకుంటే మాటతీరు, జ్ఞాపకశక్తి మెరుగుపడి పైచేయి సాధించవచ్చట.
గురువారం గురుగ్రహం ఆధిపత్యంలో ఉండే రోజు కావడంతో జీలకర్ర తినడం శుభప్రదమని చెబుతారు. ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా ఆలోచనల్లో స్థిరత్వాన్ని తీసుకొస్తుందట. శనివారం శనిగ్రహానికి సంబంధించిన రోజు. ఈ రోజు అల్లం ముక్క తింటే సహనం, ఓర్పు పెరిగి ఎదురయ్యే అడ్డంకులను తట్టుకునే శక్తి వస్తుందని విశ్వాసం. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదని, మన పూర్వీకులు అనుభవంతో రూపొందించిన జీవనశైలి సూత్రాలేనని నిపుణులు చెబుతున్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే విజయానికి దారి తానే తెరుచుకుంటుంది. వచ్చే సారి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు, ఆ రోజుకు చెప్పిన పదార్థాన్ని తిని చూడండి.. ఫలితం మీకే అనుభూతి అవుతుందేమో. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
