Fridge: ఫ్రిజ్‌ స్టోరేజ్ విషయంలో ఈ తప్పు చేస్తే.. కూరగాయలు త్వరగా పాడైపోతాయి..!

మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఇంటికి వచ్చీ రాగానే చాలామంది ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం వల్లే ఆహార పదార్థాలు ఆశించిన దానికంటే వేగంగా పాడవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అసలు సమస్య ఫ్రిజ్ కాదని, దానిలో మనం ఉంచే విధానమేనని అంటున్నారు.
పండ్లు పక్వానికి వచ్చే సమయంలో విడుదల చేసే ఒక ప్రత్యేక వాయువే దీనికి ప్రధాన కారణం. దీనిని శాస్త్రీయంగా ఎథిలీన్ వాయువు అంటారు. ఈ వాయువు పక్కన ఉన్న ఇతర పండ్లు, కూరగాయలను వేగంగా పండేలా చేస్తుంది. ఫలితంగా అవి త్వరగా మృదువుగా మారి, కుళ్లిపోతాయి. ముఖ్యంగా ఈ విషయం తెలియక పండ్లు, కూరగాయలను కలిపి ఉంచితే నష్టం తప్పదని చెబుతున్నారు.

ఉదాహరణకు యాపిల్స్. ఇవి ఎక్కువ మొత్తంలో ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. యాపిల్స్‌ను పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల పక్కన ఉంచితే అవి కొన్ని గంటల్లోనే పసుపు రంగులోకి మారి వాడిపోతాయి. ఇదే విధంగా అరటిపండ్లు, మామిడి వంటి పండ్లను కూడా సున్నితమైన కూరగాయల దగ్గర పెట్టడం ప్రమాదకరం.

ఫ్రిజ్‌లో నిల్వ చేసే సమయంలో పాల ఉత్పత్తుల విషయంలోనూ జాగ్రత్త అవసరం. పాలు, పెరుగు, వెన్న వంటి పదార్థాలను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో ఉంచడం చాలామంది చేసే పొరపాటు. డోర్ తెరిచిన ప్రతిసారి అక్కడ ఉష్ణోగ్రత మారుతుండటంతో ఇవి త్వరగా పాడవుతాయి. అందుకే ఈ పదార్థాలను ఫ్రిజ్ లోపలి భాగంలో ఉంచడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తరిగిన పండ్లు లేదా కూరగాయలను ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఇలా చేస్తే వాసనలు కలవవు, బ్యాక్టీరియా పెరగదు, ఆహారం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏది ఎక్కడ ఉంచాలో తెలుసుకుని వ్యవహరిస్తే, వృథా ఖర్చులు తగ్గడమే కాకుండా ఆరోగ్యమూ కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.