BA Raju: సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

BA Raju: బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత శత్రువు. దాదాపు 40 ఏళ్ల పాటు జర్నలిస్ట్‌గా, పీఆర్వో (PRO)గా, పబ్లిషర్‌గా మరియు నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఈ పోటీ ప్రపంచంలో కూడా ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, ‘అజాతశత్రువు’గా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలు, దర్శకుల నుండి కొత్తవారి వరకు అందరినీ సమాన గౌరవంతో, ప్రేమతో చూసేవారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లకు మార్గనిర్దేశం చేసి వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడ్డారు.

బి.ఎ. రాజు గారి వృత్తిపరమైన ప్రస్థానం అద్భుతమైనది. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలకు పబ్లిసిటీ బాధ్యతలు చూస్తూ కెరీర్ ప్రారంభించి, ఏకంగా 1500 సినిమాలకు పైగా పీఆర్వోగా పనిచేసి ఆయా చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జర్నలిజంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. పలు దినపత్రికల్లో పనిచేసిన అనంతరం, 1994లో తన సతీమణి బి. జయ గారితో కలిసి ‘సూపర్ హిట్’ (Super Hit) వీక్లీని స్థాపించారు. 27 ఏళ్ల పాటు ఒక్క వారం కూడా ఆపకుండా, తుదిశ్వాస వరకు ఆ పత్రికను నడిపించడం ఆయన అంకితభావానికి నిదర్శనం.

2001లో ‘సూపర్ హిట్ ఫ్రెండ్స్’ (Superhit Friends), ‘ఆర్.జె సినిమాస్’ (RJ Cinemas) బ్యానర్‌పై చిత్ర నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన ఇండస్ట్రీకి ఒక ‘నాలెడ్జ్ బ్యాంక్’ లాంటివారు. కంప్యూటర్ అవసరం లేకుండానే ఏ డైరెక్టర్ ఏ హీరోతో ఎన్ని సినిమాలు చేశారు, సినిమా విడుదల తేదీలు, ఎన్ని రోజులు ఆడింది, కలెక్షన్లు ఎంత అనే విషయాలు ఆయన వేళ్ళ చివర ఉండేవి.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన తోటి జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, మానసిక ధైర్యం కావాలన్నా ముందుండేవారు. పరిశ్రమలో అందరితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఆయనకు ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఉండేది.

బి.ఎ. రాజు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన బాటలో పయనం సాగుతూనే ఉంది. ఆయన స్థాపించిన ‘IndustryHit.com’ వెబ్ పోర్టల్ మరియు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా సినీ అప్‌డేట్స్ నిరంతరం అందుతూనే ఉన్నాయి. ఆయన కుమారుడు శివ కుమార్ బి, సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆర్.జె సినిమాస్ బ్యానర్‌ లను పునరుద్ధరించి, త్వరలోనే ప్రముఖ స్టార్లతో సినిమాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 24 గంటలూ సినిమాల గురించే ఆలోచించే రాజు గారి లోటు తీరనిది. ఈ రోజు ఆయన 66వ జయంతి సందర్భంగా ఆ పవిత్ర ఆత్మకు మనసారా నివాళులర్పిద్దాం.

విజయశాంతి ఫైర్ || MLC Vijayashanthi Vs MLC Teenmar Mallanna | Telangaana Legislative Council || TR