జీవితంలో కారణం తెలియని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా.. ఎంత ప్రయత్నించినా పనులు సజావుగా జరగడం లేదా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవన్నీ ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ శని ప్రభావం శాశ్వతమేమీ కాదని, కొన్ని సులభమైన ఆచరణలతో దాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఏలినాటి శని సమయంలో శని దేవుడి అనుగ్రహం పొందాలంటే, నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం చాలా శుభకరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రంగులు శని గ్రహానికి సంబంధించినవిగా భావించబడతాయి. క్రమం తప్పకుండా ఈ రంగులను ఉపయోగించడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గి, అనుకూల ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
అలాగే భక్తి మార్గం ద్వారా కూడా శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. రోజూ లేదా కనీసం వారంలో కొన్ని రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని నెగటివ్ ఎనర్జీ తగ్గి, కుటుంబంలో శాంతి నెలకొంటుందట. శని దేవుడు హనుమంతునికి భయపడతాడనే విశ్వాసం కారణంగా ఈ పారాయణానికి విశేష ప్రాధాన్యం ఉందని పండితుల అభిప్రాయం.
ప్రత్యేకంగా శని వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శని దేవుడిని పూజించడం, శని వ్రతం ఆచరించడం లేదా ఉపవాసం ఉండటం వల్ల శని శాంతిస్తాడని చెబుతున్నారు. ఈ సందర్భంగా “నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం.. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం” అనే మంత్రాన్ని భక్తితో జపిస్తే, ఏలినాటి శని తీవ్రత తగ్గుతుందనే నమ్మకం ఉంది.
దాన ధర్మాలకు కూడా శని దోష నివారణలో కీలక పాత్ర ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రతి శని వారం నల్ల నువ్వులు, నల్ల ఉప్పు, ఆవాల నూనె, పాదరక్షలు వంటి వాటిని దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని అంటున్నారు. ఇక రోజూ శని దేవుడిని స్మరిస్తూ “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శని దేవుడు ప్రసన్నుడై, చెడు ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తాడట. దీని ద్వారా మనసుకు స్థిరత్వం రావడమే కాకుండా, ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయని పండితులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఏలినాటి శనికి భయపడకుండా.. సరైన మార్గంలో భక్తి, నియమాలు పాటిస్తే అదే శని అనుగ్రహంగా మారి జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తాడని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
