ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని చోట్ల అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల అనవసర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా… పొత్తులో ఉన్న పార్టీల్లోనే నేతలు అటూ, ఇటూ మారడం వెనుక లాజిక్ ఏమిటో అర్ధంచేసుకోలేని పరిస్థితుల్లో జనసైనికులు ఉన్నారని, ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా అనే చర్చా మొదలైంది. తాజాగా వంగవీటి రాధా.. నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
అవును… నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఇరువురు సుమారు గంటకు పైగా భేటీ అయ్యారని తెలుస్తుంది. దీంతో… వంగవీటి రాధా జనసేనలో జాయిన్ అవుతున్నారా అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ చేరిక వల్ల ప్రత్యేకంగా కూటమికి కలిగే ప్రయోజనం ఏమిటి అనే కామెంట్స్ హల్ చల్ చేయడం మొదలయ్యాయి. దీంతో… రాధకు జనసేన నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారో అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
నిన్న భీమవరం నుంచి టీడీపీ మాజి ఎమ్మెల్యే అంజిబాబు జనసేనలో చేరి.. కీలకమైన భీమవరం టిక్కెట్ దక్కించుకున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే… ఆయనకు భీమవరం టిక్కెట్ ఇవ్వడానికి టీడీపీ నుంచి జనసేనలోకి చంద్రబాబు పంపించారని అంటున్నారు. ఇలా పలువురు నేతలు టిక్కెట్ల కోసం టీడీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏదో ఒక సీటు జనసేనకి దక్కితే.. అది టీడీపీ నుంచి వచ్చిన రాధకు పవన్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది!
వాస్తవానికి అధికారం ఉన్నచోట రాధ ఉండరనే మాట రాజకీయవర్గాల్లో ఉంది! గత ఎన్నికల్లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని వంగవీటి రాధాకు ఆఫర్ చేశారు జగన్. అయితే… అందుకు అంగీకరించని రాధా… విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు! అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. దీంతో… 2019లో మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలిచారు. ఐదేళ్లు అధికారం అనుభవించారు!
ఇప్పుడు బాలశౌరి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారని చెబుతున్న తరుణంలో… వంగవీటి రాధకూడా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతుంది. సపోజ్ ఈ సమయంలో రాధ.. జనసేనలో జాయిన్ అయితే ఏ టిక్కెట్ ఆశిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విజయవాడ సెంట్రల్ ఇప్పటికే బోండా ఉమకు కేటాయించారు.
విజయవాడ వెస్ట్ బీజేపీ ఖాతాలో ఉందని చెబుతూ.. పోతిన మహేష్ కు హ్యాండ్ ఇచ్చారు. దీంతో రాధ ఏ టిక్కెట్ ఆశిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రాధకు ఏ టిక్కెట్ ఇవ్వాలన్నా, ఏ పదవి ఇవ్వాలన్నా అది టీడీపీ నుంచి కూడా ఇవ్వొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా జనసేనలోకి పంపించడం వల్ల కూటమికి ఎలాంటి ప్రయోజనం కొత్తగా కలుగుతుందో పెద్దలే చెప్పాలి.