కరోనా దెబ్బతో ఆర్థికంగా చితికిపోయిన వారికి లోన్ మారటోరియం రూపంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. తొలుత మూడు నెలల పాటు ఈ వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత లాక్డౌన్ రెండు నెలలకు పైగా కొనసాగడం, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాకపోవడం లేదా కోలుకోకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించి, ఆగస్ట్ చివరి వరకు అవకాశం ఇచ్చింది. ఆగస్ట్ 31తో లోన్ మారటోరియం ముగిసింది. లాక్డౌన్ ముగిసినప్పటికీ రికవరీ ప్రారంభ దశలోనే ఉంది. మరోవైపు మారటోరియం పూర్తయింది. ఈ పరిస్థితుల్లో రుణగ్రహీతలకు అవసరమైన మద్దతు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఈ నెల 15వ తేదీలోగా రుణ పునర్వ్యవస్థీకరణ స్కీంను ప్రకటించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కోరారు.
ఆమె బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీల అధిపతులతో వర్చువల్ మార్గంలో మాట్లాడారు. ఈ మేరకు బ్యాంకు బోర్డులు తక్షణమే ఆమోదం పొందిన పరిష్కారాన్ని ప్రకటించాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న రుణగ్రహీతలు మరింతగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు. ఆమె ఈ సమావేశంలో ప్రధానంగా బోర్డు విధానాలు తక్షణమే ప్రకటించడం, అర్హత కలిగిన రుణగ్రహీతలను గుర్తించడం, వారికి ప్రయోజనాలు చేకూర్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణ వేగవంతంగా, సులభతరంగా ఉండాలన్నారు.
కంపెనీలకు ఊరట.. పునర్జీవనం
ఆర్బీఐ గత నెలలో వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ, నిరర్థక ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది. చాలా కంపెనీలు రుణ పునర్వ్యవస్థీకరణను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిని వేగవంతం చేయడం, అన్ని రంగాలకు ఎంతో ఊరట కలిగించే అంశం. మరోవైపు, బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు కూడా ఆర్బీఐ నిర్దేశించిన కాలపరిమితులకు అనుగుణంగా రుణ పరిష్కారాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. రుణాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఎన్నో కంపెనీలు తిరిగి నిలబడటానికి, నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఇది ఆర్థిక పునరుద్ధరణకు, వ్యాపార సంక్షోభం నుండి బయటపడటానికి దోహదపడుతుంది. బ్యాంకులు సమర్థవంతమైన పునర్వ్యవస్థీక ప్రణాళికను అందించాలని నిర్మల సూచించారు.
రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషలలో బ్యాంకింగ్ తమ వెబ్ సైట్లలో అప్ డేట్ చేయాలన్నారు. సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ ఆఫీసుల్లో సర్క్యులేట్ చేయాలన్నారు. ఇదిలా ఉండగా, కస్టమర్ల రుణాలు రీఫైనాన్స్ చేస్తున్నట్లుగా, బ్యాంకులు తమకు ఇచ్చిన రుణాలు కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలని ఎన్బీఎఫ్‌సీలు విజ్ఞప్తి చేశాయి. లేదా ప్రజల డిపాజిట్లు నిర్దిష్ట నియంత్రణలకు లోబడి ఉపయోగించుకునేందుకు అనుమతించాలన్నారు.