ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, కొత్త కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక అవసరాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం సమర్పించారు. ‘ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం’ (SASCI) పథకం కింద ఏపీకి ఇప్పటివరకు రూ. 2,010 కోట్లు అందాయని, అయితే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అదనంగా మరో రూ. 5,000 కోట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ‘సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh)’ ప్రోత్సాహక పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 250 కోట్ల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తూర్పు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పూర్వోదయ’ పథకాన్ని స్వాగతిస్తున్నామని, దాని విధివిధానాలను ఖరారు చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరేలా చూడాలని చంద్రబాబు అన్నారు.
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ, రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలను, ఆర్థిక అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.


