తెలుగు చిత్రసీమకు 1940 వ దశకంలో రెండు బలమైన పునాదులు పడ్డాయి. కృష్ణా జిల్లా నుంచి సినిమారంగప్రవేశం చేసిన ఇద్దరు యువనటులు భవిష్యత్తులో సినిమారంగానికి మూలస్తంభాలుగా మారుతారని, సినిమారంగంలో తిరుగులేని సంచలనాలు సృష్టిస్తారని ఎవరూ ఊహించి ఉండరేమో? వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు కాగా మరొకరు నందమూరి తారకరామారావు. మళ్ళీ వీరిద్దరిలో ఒకరు క్లాస్ హీరోగా, మరొకరు మాస్ హీరోగా యశస్సునార్జించడం మరొక అద్భుతం. అప్పటివరకు సురభి నాటకాలను తలపిస్తున్న సినిమాలు అక్కినేని, నందమూరిల రాకతో గ్లామరస్ గా మారిపోయాయి. అప్పటివరకు హీరోలుగా నటిస్తున్న చిత్తూర్ నాగయ్య, రఘురామయ్య, వైవి రావు, నారాయణ రావు మొదలైనవారంతా భారీ శరీరాలతో కథానాయికలకు తండ్రుల్లా కనిపించేవారు. కానీ, అక్కినేని, నందమూరిల ఎంట్రీతో నూనూగు మీసాల నవనవలాడే హీరోల శకం మొదలైంది.
1924 సెప్టెంబర్ 20 వ తారీఖున జన్మించిన అక్కినేని పదిహేడేళ్ల కౌమారప్రాయంలోనే 1941 లో విడుదలయిన ధర్మపత్ని అనే సినిమాద్వారా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత ఏడెనిమిదేళ్ళకు విడుదల అయిన కీలుగుఱ్ఱం, బాలరాజు అనే సినిమాలతో స్టార్ డమ్ సాధించారు. ఇక అప్పటినుంచి ఆయనకు తిరుగే లేకుండా పోయింది. ఆయన సినిమా జీవితం మరణించేంతవరకు కొనసాగుతూనే ఉన్నది. దాదాపు డెబ్బై ఏళ్ల సినిమా జీవితాన్ని అనుభవించిన ఏకైక నటుడు బహుశా భారత సినిమారంగంలో ఒక్క అక్కినేని మాత్రమే కావచ్చు. ఆయన తరువాత డజన్లకొద్దీ హీరోలు వచ్చారు. ఆయన ముందే నిష్క్రమించారు. మరికొద్ది రోజుల్లో కాలధర్మం చెందుతారనగా ‘మనం” అనే సినిమాలో ఆయన కొడుకు, మనుమళ్లతో కలిసి నటించారు.
1960 ల వరకు దక్షిణభారతదేశ సినిమారంగానికి పట్టుగొమ్మగా నిలిచిన మద్రాసును విడిచిపెట్టి వదిలిపెట్టి హైద్రాబాద్ లో నివాసాన్ని ఏర్పరచుకుని, తనతో సినిమాలు తీయాలంటే హైదరాబాద్ వచ్చి తియ్యాలని నిర్మాతలను కోరారు. అక్కినేనిని వదులుకోలేని రామానాయుడు, విబి రాజేంద్రప్రసాద్, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, లాంటి నిర్మాతలు హైద్రాబాద్ లోనే అక్కినేనితో సినిమాలు తీశారు. ఆయన హైదరాబాద్ తరలిన వేళావిశేషం ఏమిటో కానీ, సినిమారంగం మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడింది. జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి లాంటి ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో బంజారాహిల్స్ లాంటి ఎత్తైన ప్రదేశంలో ఎంతో శ్రమకోర్చి అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు. ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాతగా మరోప్రపంచం, సుడిగుండాలు వంటి కళాత్మక సినిమాలను నిర్మించారు. వాటిలో నష్టపోవడంతో ఆ తరువాత మామూలు సినిమాలను నిర్మించారు. అరవై ఏళ్ల వయసులో అక్కినేని తన సరసన ఇరవై ఏళ్ళు కూడా లేని శ్రీదేవితో నిర్మించిన ప్రేమాభిషేకం సినిమా కనకవర్షాన్ని కురిపించడమే కాక ఏడాదిపాటు ప్రదర్శించబడింది. కొన్ని చోట్ల అయిదు వందల రోజులు కూడా ఆడింది. ఆయన సరసన సుమారు అరవై అయిదు మంది హీరోయిన్లు నటించారు. అప్పట్లో అక్కినేని, ఆత్రేయ, కెవి మహదేవన్, ఘంటసాల కాంబినేషన్ ఒక చరిత్ర సృష్టించింది. ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదన రావు, ప్రత్యగాత్మ, విబి రాజేంద్ర ప్రసాద్ అక్కినేని తో ఎక్కువగా సినిమాలను చేశారు. ఆయనకంటూ కొన్ని పరిమనెంట్ సంస్థలు ఉండేవి. అక్కినేని కాల్షీట్స్ కోసం ఎన్నాళ్లయినా ఎదురు చూసేవారు. అక్కినేని-వాణిశ్రీ ల జంట ప్రేక్షకులను మత్తులో ముంచెత్తింది కొంతకాలం. ప్రేమ్ నగర్, దసరాబుల్లోడు, బంగారుబాబు, పవిత్రబంధం, విచిత్రబంధం సినిమాలు రికార్డులను తిరగరాశాయి. అలాగే అక్కినేని – సావిత్రి ల జంట కూడా ప్రేక్షకులకు కన్నులపంటగా వర్ధిల్లింది. వారి కాంబినేషన్ తో వచ్చిన మంచి మనసులు, మూగమనసులు, సుమంగళి, ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, మాంగల్యబలం మొదలైన సినిమాలు అవధులు లేని ప్రజాదరణను పొందాయి. అక్కినేని-జమున, అక్కినేని- కృష్ణకుమారి, అక్కినేని-అంజలి, అక్కినేని-జయలలిత కాంబినేషన్లో వచ్చిన అనేక సినిమాలు సూపర్ హిట్లు సాధించాయి. 1970 ల తరువాత అక్కినేనితో సుజాత, జయసుధ, జయప్రద, శ్రీదేవి జంటలుగా నటించారు. వీరిమధ్య ఎంతో వయోభేదం ఉన్నప్పటికీ, అక్కినేని నటనావైభవం కారణంగా ఆ తేడాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. సుమారు ఎనభై శాతానికి పైగా ఆయన ఖాతాలో విజయాలు చేరాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అక్కినేనితో సుమారు ఇరవై ఎనిమిది సినిమాలకు పనిచేశారు.
తన సినిమా జీవితంలో సుమారు 225 సినిమాల్లో నటించిన అక్కినేని సినిమారంగానికి సంబంధించి అన్ని పురస్కారాలను పొందారు. పద్మ పురస్కారాలు అన్నీ దక్కాయి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా వరించింది. ఒక్క భారతరత్న మాత్రమే ఆయనను వరించలేదు. ఎన్ని అవార్డులు లభించినా ప్రేక్షకులు ఆయనకు అభిమానంతో అందించిన “నటసామ్రాట్” బిరుదు ఆయనకు ఎంతో ఇష్టం. ఆయనకు లభించిన సన్మానాలు, సత్కారాలు మరెవ్వరికీ లభించలేదేమో? ఒక దశలో సన్మానం అంటూ తన దగ్గరకు ఎవ్వరూ రావొద్దని సున్నితంగా సంస్థలను హెచ్చరించేవారు.
ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థలతో ఆయనకు అనుబంధం ఉన్నది. నెలకు పదిసార్లైనా హైదరాబాద్ లోని రవీంద్ర భారతి, త్యాగరాయగానసభల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. సాహిత్యసభలకు కూడా హాజరై ఉపన్యసించేవారు. ఆయన అద్భుతమైన వక్త. చదివింది ఐదో తరగతి అయినా తెలుగు, ఆంగ్ల భాషల మీద మంచి పట్టును సాధించారు. ఆంగ్లంలో కూడా అనర్గళంగా ప్రసంగించేవారు. ఆయనకు అభిమానసంఘాలు ఎక్కువే.
ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసినపుడు అక్కినేనిని కూడా ఆహ్వానించారని, అయితే రాజకీయాలు తన ఒంటికి సరిపడవని తిరస్కరించారని అంటారు. ఇద్దరి మధ్య అపుడపుడు కొన్ని విభేదాలు పొడసూపినప్పటికీ వాటిని పెద్దవి కాకుండా జాగ్రత్త వహించారు. ఇద్దరు అగ్రనటులు కలిసి పదునాలుగు సినిమాలలో నటించారు. ఇది కూడా ఒక రికార్డే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినట్లు, కానీ, చంద్రబాబు ఊరించి ఊరించి చివరకు నిరాశలో ముంచినట్లు కూడా చెబుతారు.
తనకు విద్యాగంధం అబ్బలేదనే బాధతో ఆయన విశ్వవిద్యాలయాలకు అరవై అయిదేళ్ల క్రితమే భూరి విరాళాలను అందించారు. స్వగ్రామంలో కాలేజ్ స్థాపనకు విరాళం ఇచ్చారు. జీవితం తుదివరకు ఆరోగ్యం విషయంలో కఠినమైన క్రమశిక్షణను పాటించారు. అందుకే మరణించేదినం కూడా చాలా చురుగ్గా ఉన్నారు. జాతస్య మరణం ధృవం అని పెద్దలు చెప్పినట్లు అక్కినేని తొంభై సంవత్సరాల పాటు జీవించి 22 జనవరి 2014 నాడు అశేష అభిమానులను, సినిమారంగాన్ని శోకసముద్రంలో ముంచి ఇహలోకాన్ని వీడారు. సినిమారంగం ఆదిపురుషుల్లో ప్రథముడిగా అక్కినేని నాగేశ్వర రావు చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగురాజ్యం నివాళులు అర్పిస్తోంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు