విదేశాలకు పారిపోయి భారత ఆర్థిక వ్యవస్థను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మరోసారి రుజువైంది. రూ.13,000 కోట్లకు పైగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసానికి పాల్పడి దేశం విడిచిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టు తాజా బెయిల్ పిటిషన్‌పై నో చెప్పింది. 2019 నుండి లండన్‌లోని జైల్లో ఉన్న ఆయనకు ఇది మిగిలిన న్యాయ అవకాశాలపై కూడా ప్రభావం చూపించనుంది.
కింగ్‌స్ బెంచ్ డివిజన్ హైకోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించడంతో, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పందిస్తూ ఇది మరో విజయంగా అభివర్ణించింది. లండన్‌లోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు కూడా భారత్ తరపున వాదనలు వినిపిస్తూ నీరవ్‌కు బెయిల్ లభించకుండా నిరోధించింది. ఇప్పటికే 2018లో భారత్ విడిచిన నీరవ్ మోదీపై దేశంలో మూడు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
పీఎన్‌బీ మోసానికి సంబంధించిన సీబీఐ కేసు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఈడీ కేసు, విచారణ సమయంలో ఆధారాలు దెబ్బతీసే ప్రయత్నానికి సంబంధించిన మరొక కేసు ఉన్నాయి. అదనంగా, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న మరొక నిందితుడు మెహుల్ చోక్సీ ఇటీవల బెల్జియంలో అరెస్టు కావడం గమనార్హం.
దేశం నుండి భారీగా డబ్బులు ఎగతాళి చేసి, విదేశాల్లో ఆశ్రయం పొందాలని చూస్తున్న వారికి యూకే కోర్టు తాజా తీర్పు బలమైన హెచ్చరికగా మారింది. భారత్ తరపున జరుగుతున్న ఎక్స్‌ట్రడిషన్ ప్రక్రియకు ఇది సానుకూలంగా పరిణమించనుందన్న నమ్మకంతో ఉన్నారు అధికారులు.