ఇటీవలే తిరుపతి వైసిపి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణం హఠాన్మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. జరిగిన ఘటన దురదృష్టకరమే అయినా ఇప్పుడు ఈ బై ఎలక్షన్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఉప ఎన్నికలో ఒక సాంప్రదాయం పాటించేవారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతగా అధికార, విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉండటంతో మరి ఆ పాత సాంప్రదాయం పాటిస్తారా? లేదా?…అనేది రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
పాత సాంప్రదాయం ఏమిటంటే?…
సిట్టింగ్ ఎమ్మెల్యేలు,లేదా ఎంపీలు పదవిలో ఉండగా అకాలమరణం చెందితే ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం చేసేవారు. విపక్షాలు కూడా వారిపై పోటీకి అభ్యర్థిని పెట్టకుండా వారికే మద్దతునిచ్చేవి. దీంతో వారే ఏకపక్షంగా ఎన్నికవడం జరిగిపోయేది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆనవాయితీకి భిన్నంగా ప్రత్యర్థి పార్టీలు పోటీకి దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అందువల్లే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక సదర్భంగా ఏమి జరగనుందనేది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.
ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో?
నిబంధనల ప్రకారం ఏ కారణం చేతనైనా ఒక చట్ట సభ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించి ఆ స్థానం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతుంది. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలల్లోపు ఎన్నిక పూర్తిచేసేందుకు వీలుగా ఆ గడువు లోపే ఉప ఎన్నిక జరిగేలా షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ షెడ్యూల్ ను ఆధారం చేసుకొని ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే ఇప్పుడు దేశమంతా కరోనా విజృంభణ నేపథ్యంలో నిబంధనల ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తారా?…అది సాధ్యమవుతుందా?…అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మేం సహకరించాం…మీరు సహకరించండి
గతంలో టిడిపి ఎమ్మెల్యేల మరణం కారణంగా వారి స్థానం ఖాళీ అయినప్పుడు వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వగా వైసిపి పోటీ పెట్టకుండా సహకరించి ఏకపక్ష విజయానికి సహకరించింది. అయితే 2017లో జరిగిన ఒక్క నంద్యాల ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. కారణం అప్పుడు అక్కడ విభిన్నమైన పరిస్థితులు ఉండటమే…వైసిపి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన గుండెపోటుతో చనిపోగా సాంకేతికంగా అది తమ సీటే కాబట్టి తమకే చెందాలని వైసిపి భావించి పోటీలోకి దిగింది. అయితే అప్పుడు అధికారపక్షమైన టిడిపి ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దృష్టి సారించి ఘన విజయం సాధించింది.
ఇప్పుడు పరిస్థితులు వేరు…
అయితే ఇప్పుడు తిరుపతి ఎంపి సీటు వైసిపిది కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే వారిపై టిడిపి పోటీ చేస్తుందా?…లేక పాత సాంప్రదాయానికి గౌరవమిస్తుందా?…అనేది సస్పెన్స్ గా మారింది. కారణం బల్లి దుర్గా ప్రసాద్ ఇప్పుడు వైసిపి అయినా గతంలో సుదీర్ఘకాలం ఆయన టిడిపి నేతగానే ఉన్నారు. సొంత జిల్లా నేతగా ఆ రకంగా ఆయన కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబుకు బాగా తెలిసినవారే. సరే…ఒక వేళ టిడిపి పోటీ పెట్టకపోయినా బిజెపి-జనసేన పోటీకి దిగకుండా ఉంటాయా?…అనేది కూడా ప్రశ్నార్థకమే…అంతే కాదు ప్రస్తుతం రాష్ట్రంలో అధికార,విపక్షాల మధ్య నెలకొని ఉన్న వ్యక్తిగత స్థాయి కక్షల వంటి పరిస్థితుల కారణంగా ఈ సాంప్రదాయాలు, ఆనవాయితీలు వంటి వాటికి విలువిచ్చి పాటించడం ఉంటుందా?…లేక ఈ ఎన్నిక ఫలానా దానికి రిఫరెండం అంటూ పోటీకి సై అంటారా అనే చర్చ రాజకీయ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ ఉత్కంఠ వీడాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.