రెండు వ్యవస్థల మధ్య పోరాటం.. చివరికి ఏమవుతుంది.? ఈ అంశంపై మీడియాలో ఆసక్తకిరమైన చర్చలు జరుగుతున్నాయి. ఓ న్యాయ నిపుణుడి అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం.. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్‌కి సహకరించాల్సిందేననీ, లేని పక్షంలో రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ పాత్ర అత్యంత కీలకమవుతుందనీ, అది ‘ఎక్స్‌ట్రీమ్’ కండిషన్స్‌కి దారి తీసే ప్రమాదం వుందనీ తెలుస్తోంది. ‘రాజ్యాంగంలో బతికే హక్కు కూడా వుంది.. ప్రాణం మీదకు వస్తే, ప్రాణాల్ని నిలబెట్టేందుకు ప్రాణం తీసేయొచ్చు కూడా..’ అని ఉద్యోగ సంఘాల నాయకుడొకరు చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత దిగజారింది ఆంధ్రపదేశ్‌లో. పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది ఇంకో చర్చ. కానీ, ఈలోగా వ్యవస్థలు కుప్పకూలిపోయే దుస్థితి దాపురించింది. సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది.
ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఎలా రాబోతోందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అత్యంత వ్యూహాత్మకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పగా.. ప్రభుత్వంతో తగు రీతిలో ఆయన సంప్రదింపులు జరపలేదు సరికదా.. జరిపిన ఆ కాస్త సంప్రదింపుల ఎపిసోడ్ కూడా ‘మమ’ అన్నట్టుగా సాగడం.. ప్రభుత్వం వాదనల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం.. వివాదాలకు తావిచ్చింది. కరోనా పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టకుని, ప్రభుత్వ వాదనను నిమ్మగడ్డ పరిశీలించి, ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వుండాల్సింది. హైకోర్టు కూడా, ప్రజారోగ్యం ముఖ్యమే.. ఎన్నికలు కూడా ముఖ్యమేనని పేర్కొన్న దరిమిలా.. అందుకు తగ్గట్టుగా నిమ్మగడ్డ వ్యవహార శైలి కన్పించలేదన్నది ప్రభుత్వ వాదన. అయితే, ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉద్యోగుల బాధ్యతను ప్రభుత్వం చూసుకోవాల్సి వుంటుంది. కానీ, ప్రభుత్వమే ఉద్యోగుల్ని రెచ్చగొడుతోందన్న సంకేతాలు తాజా పరిణామాల్ని బట్టి కనిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అస్సలు మేలైన విషయం కాదు. తెగేదాకా ఈ విషయాన్ని లాగడం రాష్ట్ర భవిష్యత్తుకీ మంచిది కాదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. రేప్పొద్దున్న ప్రభుత్వం మీద మచ్చ పడితే.. దాన్ని చెరిపేసుకోవడం అంత తేలిక కాదు. పైగా, ‘ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్’ అనే పరిస్థతి వస్తే, జగన్ సర్కార్ మనుగడ ఏమవుతుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.