నిన్న గుజరాత్ లో ఒక అఖిలభారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ముఖ్య ఉపన్యాసంలో కోర్టులు తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నాయి” అని న్యాయవ్యవస్థకు చురకలు వేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏసీబి వారు కొందరు వ్యక్తుల మీద నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ మీద గాగ్ ఆర్డర్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం యాధృచ్ఛికమే కావచ్చు. కానీ, వెంకయ్య నాయుడు చేసిన ఉపన్యాసం మాత్రం మూడు ప్రధాన రాజ్యాంగ వ్యవస్థలకు ఒక సలహా అని భావించవచ్చు.
ప్రభుత్వం నుంచి, వ్యవస్థలనుంచి మన హక్కులకు భంగం వాటిల్లినపుడు, మనం వేధింపులకు గురి అవుతున్నప్పుడు ముందుగా ఎవరైనా ఆశ్రయించేదే న్యాయస్థానాలనే. అర్ధరాత్రి వెళ్లి తలుపుకొట్టినా పలికే వ్యవస్థగా న్యాయవ్యవస్థకు ప్రజలలో మంచి అభిప్రాయం ఉన్నది. గత ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థ కట్టు తప్పిందని, ఎవరో ఒకరికి మేలు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల్లో అధికంగా జోక్యం చేసుకోవడం, ప్రభుత్వానికి దురుద్దేశ్యాలు అంటగడుతూ విమర్శలు చెయ్యడం, ఉన్నతాధికారుల మనస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చెయ్యడం, కోర్టుకు పదేపదే పిలిపించడం ఒక దురలవాటుగా మారిపోయింది. ప్రభుత్వాన్ని కించపరిచేలా న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు పసందైన విందులా నోళ్లు ఊరిస్తున్నాయి. అవి మరికొంత మసాలా కలిపి ధర్మాసనాలు చెయ్యని వ్యాఖ్యలను కూడా చేసినట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించడమే.
అలాగే హైకోర్టు “అంతు తేలుస్తాం” “రాజ్యాంగ విచ్ఛిత్తి జరిగిందో లేదో తేలుస్తాం” “ఈ రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చు” “మీకు మీ శాఖ మీద నియంత్రణ ఉన్నదా” “నువ్వు ప్రమోటీవా రిక్రూటీవా” “మతి లేని చర్యలు కావా?” అంటూ హేళనాపూర్వక ప్రశ్నలు వేసి అవమానించడం, చౌకబారు పదప్రయోగాలు చెయ్యడం తరచుగా జరుగుతున్నది. ప్రభుత్వం కూడా ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని, దాని అధిపతిని రాష్ట్రం మొత్తం కలిసి అయిదేళ్లవరకు నియమించుకున్నదని, ఆ ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయనే కనీస స్పృహ కూడా లేకుండా హైకోర్టు తన హద్దులు మించి వ్యవహరిస్తున్నది.
రాజధాని అనేది ఎక్కడ పెట్టుకోవాలో అది ప్రభుత్వ హక్కు, అధికారం. మూడు రాజధానులు ఉండాలో, ముప్ఫయి రాజధానులు ఉండాలో చెప్పడానికి కోర్టులకేమి అధికారం ఉన్నది? కేంద్రం కూడా ఈ విషయంలో అధికారం మొత్తం రాష్ట్రానిదే అని పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, కోర్టులు ఈ విషయంలో అనుచితంగా జోక్యం చేసుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం?
ఇక రాష్ట్రంలో జరిగే నేరాలు, అవినీతిని కట్టడి చెయ్యడం, అవినీతిపరులమీద విచారణ చెయ్యడం, కేసులు పెట్టడం ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారపరిధి లోనిది. ఇంకా చెప్పాలంటే పోలీసుల విధి. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు అవినీతి నిరోధక సఖ దర్యాప్తు చేసి పదమూడు మందిని నిందితులుగా చేర్చి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ కూడా చెయ్యకుండానే మాజీ అడ్వొకేట్ జనరల్ హడావిడిగా కోర్టుకు వెళ్లడం, తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరడం, ఆ పిటీషన్ లో మెరిట్స్ ఏమిటో కూడా విచారించకుండా హైకోర్టు వెంటనే ఆయనతో పాటు, కోర్టును కోరని మరో పన్నెండు మందికి కూడా వర్తించే విధంగా దర్యాప్తు జరపరాదని ఆదేశాలు ఇవ్వడం అంటే అది పోలీసుల విధినిర్వహణలో అనుచిత జోక్యం చెసుకోవడం కాదా? ఒకవేళ పోలీసులు తమను వేధిస్తున్నారని నిందితులు హైకోర్టుకు విన్నవించుకుంటే అప్పుడు ఆ దర్యాప్తు సక్రమంగా సాగుతున్నదా అని పరిశీలించి తగు ఉత్తర్వులు ఇవ్వచ్చు కానీ, అసలు దర్యాప్తే చెయ్యడానికి వీలులేదు అంటే ఇక పోలీసు వ్యవస్థ దేనికి?
అయితే హైకోర్టుకు గాగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి అధికారాలు ఉన్నాయని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే అలాంటి గాగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి ముందే ఆ ఎఫ్ ఐ ఆర్ లోని సమాచారం పత్రికలకు, మీడియాకు చేరిపోయింది. అలాంటప్పుడు గాగ్ ఆర్డర్స్ ఇవ్వడం వలన ప్రయోజనం ఏముంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ గాగ్ ఆర్డర్స్ పై స్టే ఇవ్వడం ద్వారా రాష్ట్రప్రభుత్వానికి కొంచెం ఊపిరి పోసిందని, ఊరట కలిగించిందని భావించవచ్చు. అలా గాగ్ ఆదేశాలు ఇవ్వడం సందర్భోచితం కాదని హైకోర్టును పరోక్షంగా తప్పు పట్టినట్లయింది. దురదృష్టం ఏమిటంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఎంత పెద్ద ఉన్నతాధికారి తప్పు చేసినా, పై అధికారులు విచారణ జరిపి తప్పులు దిద్ది తప్పు చేసిన అధికారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుంది. కానీ న్యాయవ్యవస్థలో అలాంటి భయం లేదు. కింది కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పై కోర్టు కొట్టేయగలదు కానీ, ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్న న్యాయమూర్తిని ఏమీ చెయ్యలేదు. న్యాయవ్యవస్థలో అతి పెద్ద లోపం ఇది. ఇక ఈ కేసు జనవరి నెలాఖరు వరకు ముందుకు వెళ్లకపోవచ్చు. ఆ తరువాత ఏమవుతుందో వేచి చూడాలి.
ఇలపావులూరి మురళి మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు