సీసా పాతదే.. సారా పాతదే: నవ్విపోదురుగాక నాకేటి?

రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీతో జతకట్టాను.. చంద్రబాబు అరెస్ట్ తర్వాతే తనకు ఈ ఆలోచన వచ్చింది.. ప్రజల కోసమే, ప్రజాభిష్టం మేరకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను.. ఇది జనసేన అధినేత ఇచ్చిన వివరణ! రాష్ట్రంలో అభివృద్ధి కొరవడింది.. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని పవన్ నమ్ముతున్నారు, జనం నమ్ముతున్నారు అందుకే జనసేనతో పొత్తు.. ఇది నారా లోకేష్ వెర్షన్! ఈ కొత్తగా చెబుతున్న పాత కలయిక త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది.

రాష్ట్రాభివృద్ధి కోసం, జనసైనికుల కోరిక మేరకు, టీడీపీ కార్యకర్తల మనొభిష్టం మేరకు కలిశామని చెబుతున్న ఈ రెండు పార్టీలూ నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. అంటే… టీడీపీ మేనిఫెస్టోపై పవన్ ఫోటో కూడా ఉంటుందన్నమాట! అయితే ఇలాంటి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడం ఇదే తొలిసారి అన్నట్లుగా చెబుతున్నారని.. ఇది పాత చింతకాయ పచ్చడే అని.. ఆ ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీ వాసులు అనుభవించేశారని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు!

అవును… సుమారు పదేళ్ల క్రిందట 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ సమయంలో… ప్రజలకిచ్చిన హామీలపై బాబు, పవన్‌ ఇద్దరూ సంతకాలు చేసిన కరపత్రాలను ఇంటింటికీ పంచారు. పత్రికలకు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకటనల్లో చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్‌ ఫోటోలూ ప్రముఖంగా ప్రచురించారు.

దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయండి.. టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. వాటిని టీడీపీ అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత కూడా తనదేనంటూ పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు వాగ్దానమిచ్చారు. కట్ చేస్తే… పవన్ షూటింగుల్లో బిజీ అయిపోయారు!

అనంతరం లోకేష్ అత్యంత అవినీతి పరుడని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతీ నియోజకవర్గంలోనూ వందల కోట్ల అవినీతి జరుగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇద్దరినీ నమ్మలేదు! ఫలితంగా టీడీపీకి చావుతప్పి కన్ను లోటబోయినంత పనైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 23 సీట్లకే పరిమితమైంది.

ఇక జనసేనకు ఒక్క సీటు రాగా.. పవన్ కల్యాణ్ కి ఒక్కటి కూడా రాలేదు! ఆ స్థాయిలో ప్రజలు హామీ ఇచ్చిన చంద్రబాబుని, ఆ హామీలకు భరోసా ఇచ్చిన పవన్ బాబుని పక్కన పెట్టేశారు. ఈ సమయంలో మరోసారి ఇద్దరూ రెడీ అవుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అని చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము కలుస్తున్నామని ఊదరగొడుతున్నారు. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోసం రాజమండ్రిలో సమావేశమైనట్లు తెలిపారు!

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రైతుల పేరిట రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలుండగా… వాటన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు! అందుకు తనది భరోసా అని పవన్ కల్యాణ్ షూరిటీగా నిలబడ్డారు!

దీంతో జనం నమ్మారు.. ఓటూ వేశారు.. చంద్రబాబు సీఎం అయ్యారు.. ఐదేళ్లలో కేవలం రూ.15 వేల కోట్ల రుణాలను మాత్రమే బాబు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. ఈ విషయంపై ప్రశ్నించిన మీడియాపైనా బాబు చిందులేశారు. రుణమాఫీ చేసేశామని సైడైపోయారు!! 2019 ఎన్నికల్లో జనం బాబుని సైడ్ చేసేశారు!

ఇక తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు చంద్రబాబు. తనది ష్యూరిటీ అని పవన్ భరోసా ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో 70 లక్షల మంది డ్వాక్రా మహిళల్లో ఎవ్వరికీ పైసా రుణం కూడా చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయలేదు! ఇదే విషయాన్ని నాటి సంబంధిత మంత్రిగా ఉన్న పరిటాల సునీత… అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం ఒప్పుకున్నారు!

యువతకు నిరుద్యొగ భృతి అన్నారు.. నేను ఉన్నాను మీరు గుద్దెయ్యండి అని పవన్ అన్నారు. కట్ చేస్తే… నాడు సంబంధిత శాఖామంత్రి అచ్చెన్నాయుడు తప్పించుకు తిరిగారు. నిరుద్యోగ భృతి సాధ్యం కాదని చెప్పారు. అది హామీ ఇచ్చేముందు ఆలోచించుకోవాలి కదా అని పవన్ ప్రశ్నించలేకపోయారు! ఇలా అందినకాడికి ప్రజలను మోసం చేసింది టీడీపీ – జనసేన ధ్వయం!

ఈ క్రమంలో మరోసారి 10 గ్యారెంటీలు అని చెబుతూ ఒక ఉమ్మడి మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తున్నాయి టీడీపీ – జనసేనలు! ఈ మేనిఫెస్టోను నవంబర్ 1 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి… జనం నమ్ముతారనే అనుకుంటున్నారా.. జనం గతం మరిచిపోయారని వీరు భావిస్తున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.