సంతృప్త స్థాయిలో సంక్షేమ పధకాలు 

Satisfaction level welfare schemes
ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయపార్టీలు అనేకరకాల వాగ్దానాలను చేస్తుంటాయి.  అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి.  ఎన్నిసార్లు ఆ పార్టీలు, నాయకులు తమ మాటను నిలబెట్టుకోలేకపోయినా, గొర్రె కసాయివాడిని నమ్మినట్లు నాయకులు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్ముతూనే ఉంటారు.  ప్రజల అమాయకత్వమే నాయకుల బలం.  నాయకుల కల్లబొల్లి కబుర్లను నమ్మడం ప్రజల బలహీనత.  అక్రమార్జనాపరులు విదేశాల్లో దాచుకున్న లక్షలకోట్ల నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ప్రధాని మోడీ 2014  ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తే గుడ్డిగా నమ్మేసిన వారు కోట్లలో ఉంటారు.  2014  ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరువందల హామీలను ఇచ్చారు.  చంద్రబాబుకు ఉమ్మడిరాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పరిపాలించిన అనుభవం ఉన్నది. 
కరెంట్ చార్జీలు తగ్గించమని ఆందోళన చేస్తున్న రైతుల మీద తుపాకీ కాల్పులు జరిపించి ముగ్గరు మరణించడానికి కారకుడైన చంద్రబాబు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారాన్ని వెనక్కు తెచ్చి ఇస్తామని హామీ ఇస్తే పూర్తిగా నమ్మేసి గెలిపించారు!   సరిగ్గా ఈ బలహీనతే నాయకుల పాలిటి వరంగా పరిణమిస్తున్నది.  
 
Satisfaction level welfare schemes
Satisfaction level welfare schemes
స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నికల హామీలను సంపూర్ణంగా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే కనిపిస్తారు.  ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాక, ఇవ్వనటువంటి రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ  లాంటి ఖరీదైన సంక్షేమపథకాలు కూడా అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే.  అవి కాంగ్రెస్ పార్టీ పధకాలు అని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొణుగుతారు.  కానీ, అవి కాంగ్రెస్ పార్టీ పధకాలు కావని, అవి పార్టీ పథకాలైతే మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు జరిపేవారని వారి అంతరాత్మలకు తెలుసు.  
 
వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత మళ్ళీ ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన ఘనకీర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే.  నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పాలించినపుడు అది ఉమ్మడి రాష్ట్రం.  ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న ఆర్ధిక వనరులు వేరు.  పైగా కేంద్రంలో అప్పుడు ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.     కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది విడిపోయిన పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి.  పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నది  మిత్రపక్షం కాదు.    అంతకుముందు పాలించిన చంద్రబాబు నాయుడు పాలనలో పూర్తిగా దివాళా తీసి మూడు లక్షల కోట్ల రూపాయల ఋణభారాన్ని మోస్తున్న రాష్ట్రానికి.  చంద్రబాబు నాయుడు మిగిల్చిన వందకోట్ల బాలన్స్ తో ఆయన పరిపాలన ప్రారంభించారు.  అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని అప్పటిదాకా ఆర్ధిక శాఖామంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు కూడా ఎకసక్కేలు ఆడారు.  అలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు డజన్లకు పైగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారు.  సరే,  ఆయన ఎలాంటి తిప్పలు పడుతున్నారో మనకు తెలియదు కానీ కరోనా క్లిష్టసమయంలో కూడా పధకాల అమలుకు బ్రేక్ వెయ్యలేదు.  
 
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గూర్చి చర్చించడం, ప్రస్తుతించడం ఇక్కడ నా అభిమతం కాదు.  అయినప్పటికీ ఆయన మదిలోనుంచి పుట్టిన మూడు మహత్తరమైన ఆలోచనల గూర్చి ప్రస్తావించడం మాత్రం నేరం కాబోదు.  దేశంలో ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కూడా రాని మూడు అద్భుతమైన ఆలోచనలు, లేదా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి మదిలో పురుడు పోసుకున్నాయి.  వాటిలో ఒకటి గ్రామసచివాలయాలు.  రెండవది  వాలంటీర్ వ్యవస్థ.  వాస్తవం చెప్పుకోవాలంటే గ్రామసచివాలయాలు అనేవి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ.  ఈ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పుణ్యమా అని నాలుగు లక్షలమంది యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి.  అలా అని ఇవి ఏవో తాత్కాలికమైన ఉద్యోగాలు కావు.  శాశ్వతమైన ఉద్యోగాలు.  జీవిత భద్రత ఇచ్చేవి.    మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లాంటిదే నేటి గ్రామ సచివాలయ  వ్యవస్థ..  
 
 
ఇంజినీరింగ్ కోర్సులు చదివి, పెద్ద పెద్ద ఐటి కంపెనీలలో ఫ్రెష్ గా చేరేవారికి పదినుంచి పన్నెండు వేల రూపాయల వేతనం లభిస్తున్నది.  కానీ, సాధారణ డిగ్రీ మాత్రమే చదివిన సచివాలయ ఉద్యోగులకు నెలకు పదిహేను వేలరూపాయలను చెల్లిస్తున్నారు.  సుమారు ఆరువందల రకాల పౌరసేవలను ఈ సచివాలయాలు అందిస్తున్నాయి.  లంచగొండితనం లేదు.  ఒకటిరెండు రోజుల్లోనే పనులు జరుగుతున్నాయి.  అప్పటివరకు రెవిన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ, అధికారుల కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కాని పనులు సచివాలయ వ్యవస్థ ద్వారా జరిగిపోతున్నాయి.  ఇక గ్రామ సచివాలయం అంటే నగరానికి, పట్టణానికి ఏదో ఒక మూల ఒక్కటే ఆఫీసు కాదు.  ప్రతి రెండు వార్డులకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు.  ఈ విధానం వలన సచివాలయ ఉద్యోగులకు కూడా పనిభారం పడదు.  ప్రజలు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.  
 
అలాగే వాలంటీర్ వ్యవస్థ.  వలంటీర్ల సేవల విలువ ఏమిటో మొన్న కరోనా సమయంలో ప్రజలకు  బాగా తెలిసింది.  తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లడం, అక్కడ వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవడం, కోవిద్ రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, కోలుకున్న తరువాత మళ్ళీ ఇళ్లలో దిగబెట్టడం, గృహస్తులకు కావాల్సిన సరుకులు, సంబరాలు స్వయంగా తెచ్చి ఇళ్లలో ఇవ్వడం, కొత్తగా గ్రామాల్లో అడుగుపెట్టినవారిని గుర్తించడం, క్వారంటైన్ సెంటర్లకు తరలించడం లాంటి సేవలు వలంటీర్ల ద్వారా ప్రజలు కాలు కదపకుండా అందాయి.  నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి పౌరసేవలు లేవు. “మూటలు మోసే ఉద్యోగాలు…వాళ్లకు పిల్లను ఎవరిస్తారు” అంటూ ప్రతిపక్ష నేత తన అక్కసును వెళ్లగక్కినా ప్రజలు మాత్రం వాలంటీర్ల సేవలను కొనియాడుతున్నారు.  
 
ఇక చెప్పుకోవాల్సిన మూడో విప్లవాత్మకమైన పధకం రాష్ట్రంలోని సుమారు ముప్ఫయ్ఒక్క లక్షలమంది నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చెయ్యడం.  అనేక ప్రభుత్వాలు ఇళ్లస్థలాలు ఇవ్వడం, ఇళ్లను నిర్మించి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు అమలు చేశారు కానీ అవి పూర్తి ఉచితం కావు.  చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన టిడ్కో ఇళ్ళు కూడా ఉచితం కావు.  లబ్ధిదారులు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది.  ఐదేళ్లు పరిపాలించినప్పటికీ చంద్రబాబు సంపూర్ణంగా ఆ పధకాన్ని అమలు చెయ్యలేదు.  మొన్న ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన తరువాత లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని చూసిన తరువాత ఈ పధకానికి చంద్రబాబు ఎందుకు అడుగడుగునా అడ్డుపడ్డారో సులభంగా అర్ధం అవుతుంది.  ఈ పధకం ద్వారా తెల్ల రేషన్ కార్డులు కలిగి, ప్రభుత్వం రూపొందించిన నియమనిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికి యాభై చదరపు గజాలు కొందరికి, డెబ్బై అయిదు చదరపు గజాలు కొందరికి ఉచితంగా అందించారు.  వాటిలో ఇళ్ల నిర్మాణ భాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకున్నది.  అలా కాకుండా లబ్ధిదారులు తమంతట తాము నిర్మించుకుంటామంటే నిర్మాణ ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది.  ఏ రకంగా చూసినా కనీసం ఒక్కొక్క లబ్ధిదారుడికి అయిదారు లక్షల రూపాయల ఆస్తిని ప్రభుత్వం సమకూర్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు.  ఇటీవల ఈ వ్యాసకర్త కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పధకాల అమలును చూసి లబ్ధిదారులతో మాట్లాడినపుడు వారు వెలిబుచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు.  గత పాతికేళ్లుగా మమ్మల్ని ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వమే లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు, అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి తమ కులం వారికి, తమ అనుచరులకు, తమ బంధువులకు లబ్ది చేకూర్చారని, తొలిసారిగా కులం, మతం, పార్టీల భేదం లేకుండా పేదలు అందరికీ స్థలాలు దక్కాయని, తాము జీవితాంతం జగన్మోహన్ రెడ్డి  పేరును గుర్తుంచుకుంటామని సంతోషంతో చెప్పుకొచ్చారు.  
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి, వారు దోచుకోవడానికి తగినంత సమయం ఇచ్చి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా ఆ కమిటీలను రద్దు చేశారు.  కానీ, అప్పటికే జన్మభూమి కమిటీ వ్యవస్థ అవినీతిమయంగా అపఖ్యాతి పాలైంది.  ప్రతి చిన్న విషయానికి కమిటీ వారికి లంచాలు ఇవ్వడం, వారి దయాదాక్షిణ్యాలకోసం వెంపర్లాడటం, వారు సిఫార్స్ చెయ్యకపోతే జిల్లా కలెక్టర్ కూడా ఏమీ చేయలేని దుస్థితి ఉండేది.  ఆ చేదు అనుభవాలతో కాబోలు…ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అవినీతిరహితంగా తీర్చిదిద్దారు.  ఎవరైనా కక్కుర్తి పడితే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.  అన్నీ పత్రాలు సక్రమంగా ఉంటే కావాల్సిన సేవలు నిముషాల్లో అందుతున్నాయి.  అందుకే ఈ వ్యవస్థ విజయవంతం అయింది.  జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మూడో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించగలిగారంటే దానివెనుక పటిష్టంగా అమలు చేస్తున్న ఇలాంటి సంస్కరణలే కారణం.  ఇంటిస్థలాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ ఎందుకింత భయపడుతున్నదో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వులే  సమాధానం చెబుతాయి.  
 
 
ఎంత చేస్తున్నా అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం.  లోటుపాట్లు దొర్లుతూనే ఉంటాయి.   తాత్కాలిక అడ్డంకులను అధిగమిస్తూ  ముందుకు సాగిపోవడమే ధీరోదాత్తుల లక్షణం.  అలాంటివారు తమకు ఆటంకాలను సృష్టించేవారితో కూడా విరోధాన్ని పెట్టుకోరు.  మంచి గంధపు చెట్టు తనను నరికిన గొడ్డలికి కూడా సువాసన కలుగజేస్తుంది అని పెద్దల మాట!   
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు