సనాతన ధర్మంలో శివభక్తికి అత్యున్నత ప్రతీకలుగా భావించబడేవి జ్యోతిర్లింగాలు. శివుడు తేజోమయ స్వరూపంలో స్వయంగా అవతరించిన స్థలాలనే జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పురాణాలు వివరిస్తాయి. శివ పురాణం ప్రకారం భూమిపై మొత్తం 12 జ్యోతిర్లింగాలు వెలిశాయి. ఇవన్నీ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువై ఉండి, కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువులుగా నిలిచాయి.
జ్యోతిర్లింగాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు.. అవి శివుని నిరాకార, శాశ్వత శక్తికి ప్రతిరూపాలు. ఈ క్షేత్రాలను దర్శించి అభిషేకాలు, పూజలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, మనసుకు శాంతి లభిస్తుందని, జన్మజన్మల బంధాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మహాశివరాత్రి, శ్రావణ మాసం, సోమవారాల్లో జ్యోతిర్లింగ దర్శనం అత్యంత ఫలప్రదమని శాస్త్రాలు చెబుతాయి.
అయితే సాధారణ దర్శనంతో పాటు, మన రాశికి అనుగుణంగా జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మరింత శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గ్రహాధిపతుల ప్రభావాన్ని సమతుల్యం చేసే శక్తి జ్యోతిర్లింగాలకు ఉందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది.
మేష రాశివారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే ఆత్మబలం పెరుగుతుందని నమ్మకం. ఇక వృషభ రాశివారికి సోమనాథ దర్శనం ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. మిథున రాశివారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజిస్తే బుద్ధి వికాసం, కార్యసిద్ధి కలుగుతాయి. కర్కాటక రాశివారు ఓంకారేశ్వరుడిని ఆశ్రయిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహ రాశివారికి వైద్యనాథ దర్శనం ఆరోగ్యబలాన్ని అందిస్తే, కన్యా రాశివారు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శిస్తే పాపక్షయం కలుగుతుందని విశ్వాసం. తులా రాశివారికి మహాకాళేశ్వర దర్శనం కాలదోష నివారణకు ఉపకరిస్తుంది. వృశ్చిక రాశివారు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే శత్రుబాధలు తొలగుతాయి.
ధనుస్సు రాశివారు కాశీ విశ్వనాథుడిని దర్శించి గంగాస్నానం చేస్తే జ్ఞానోదయం కలుగుతుందని చెబుతారు. మకర రాశివారు భీమశంకర దర్శనంతో శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం. కుంభ రాశివారు కేదార్‌నాథ దర్శిస్తే ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు. మీన రాశివారికి త్రయంబకేశ్వర దర్శనం దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తి, విశ్వాసం, శాస్త్రోక్త పద్ధతులు కలిసినప్పుడు జ్యోతిర్లింగ దర్శనం జీవన మార్గాన్ని మారుస్తుందనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. (గమనిక: ఈ కథనం నిపుణుల అందించిన సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
