నన్ను చూసి భారత్ వణుకుతోంది.. లష్కరే టాప్ ఉగ్రవాది సైఫుల్లా కసూరి ప్రగల్భాలు..!

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద అజెండాను మరోసారి బహిరంగంగా చాటుకున్నాడు లష్కరే తోయిబా టాప్ లీడర్, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన కసూరి, తన ఉనికినే చూసి భారత్ భయపడుతోందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ అంశంలో తమ పోరాటం కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని ప్రగల్భాలు పలికాడు.

అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ అసలు ముఖాన్ని కసూరి వ్యాఖ్యలు మరోసారి బయటపెట్టాయి. పాక్ ఆర్మీ తనను స్వయంగా ఆహ్వానిస్తుందని. యుద్ధంలో మరణించిన సైనికులకు జరిగే అంత్యక్రియల ప్రార్థనలు తానే నిర్వహిస్తాను అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, పాక్ సైన్యం–ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న లోతైన సంబంధాలను బహిర్గతం చేశాయి.

గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను కసూరి తన ప్రసంగంలో ప్రస్తావించాడు.

ఆ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని కసూరి స్వయంగా అంగీకరించడం గమనార్హం. అయితే, భారత్ కేవలం ఉగ్ర స్థావరాలకే పరిమితమవడం తమకు అనుకూలంగా మారిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు అతడి ఉద్దేశాలు ఎంత ప్రమాదకరమైనవో స్పష్టం చేస్తున్నాయి.

పహల్గామ్ దాడి తర్వాత తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని, అదే తనకు శక్తినిస్తోందని కసూరి చెప్పడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఉగ్రవాదాన్ని కీర్తిగా భావించే అతడి మాటలు యువతను రెచ్చగొట్టేలా ఉండటం భద్రతా నిపుణులను కలవరపెడుతోంది.

కసూరి తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ ప్రపంచానికి సందేశాలు ఇస్తూనే, మరోవైపు ఉగ్ర నేతలకు వేదికలు కల్పించడం, వారి వ్యాఖ్యలను సహించడం ద్వారా ప్రాంతీయ భద్రతకు పాక్ పెద్ద ముప్పుగా మారుతోందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి.