సంక్రాంతికి సినిమాలు పోటెత్తుతున్నాయ్. రవితేజ ‘ఈగల్’ రేసులోకి దూసుకొచ్చింది. జనవరి 13న సినిమా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ సినిమా కూడా లైన్లోనే వుంది. దానికీ, అధికారికంగా సంక్రాంతి రిలీజ్ అనే ప్రకటన ఇచ్చేశారు.
సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న ‘గుంటూరు కారం’ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి స్లాట్ ఖరారు చేసుకున్నాయి. సంక్రాంతి కాస్త దూరంగానే వుంది.
అయితే, సంక్రాంతికి నాలుగైదు సినిమాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.. అలా చేయడం వల్ల అన్ని సినిమాలకీ మంచి వసూళ్ళు వుంటాయి. అయితే, నిర్మాతల కక్కుర్తి కారణంగా, ఒక సినిమాతో ఇంకో సినిమాకి క్లాష్ తప్పదు.
గతంలో జరిగిందదే. అలా కొన్ని సినిమాలు నష్టపోయాయి కూడా. ఈ సంక్రాంతికీ, ఆ నష్టం తప్పకపోవచ్చు. ‘మేమే ముందు నిర్ణయం తీసుకున్నాం..’ అని ఒకరు, ‘కాదు కాదు, మేమే ముందు నిర్ణయం తీసుకున్నాం’ అని ఇంకొకరు.. ఇలా వాదులాడుకుంటున్నారు.
పరిశ్రమలో అంతా అన్నదమ్ముల్లా వుంటాం.. అని చెప్పేది ఉత్తమాట. ఈ క్లాష్ చూస్తోంటే, ఈ సంక్రాంతి.. నిర్మాతల మధ్య పెద్ద పెద్ద గొడవలకు కారణమయ్యేలా వుంది. ఇప్పటికే ఈ విషయమై పంచాయితీ గట్టిగా సాగుతోందనీ, పరిశ్రమ పెద్దలు కొందరు, ఆయా నిర్మాతలతో మాట్లాడే ప్రయత్నాలు ప్రారంభించారనీ తెలుస్తోంది.
స్ట్రెయిట్ సినిమాలే కాదు, డబ్బింగ్ సినిమాల పంచాయితీ కూడా షురూ కానుంది. ఆ ముచ్చటపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.