నాగార్జున సాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఇంకా ఈ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, అప్పుడే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణం చెందారు గనుక, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనీ, వారిని గెలిపించుకోవడం సంప్రదాయమనీ టీఆర్‌ఎస్ నేతలు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో ఈ ‘సంప్రదాయ’ వున్నమాట వాస్తవమే. కానీ, టీఆర్‌ఎస్ రెండుసార్లు ఆ సంప్రదాయాన్ని లెక్క చేయలేదు. ఖమ్మం జిల్లా పాలేర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం చెందితే, ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి.. అధికారాన్నంతా అక్కడ ప్రయోగించి గెలిచింది టీఆర్‌ఎస్. ఇంకో నియోజకవర్గంలోనూ ఇలాగే చేసింది గులాబీ పార్టీ. బహుశా ఆ ఎఫెక్ట్ మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక మీద పడిందేమో. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబానికి ఓటమి తప్పలేదు. కాలం మారింది.. టీఆర్‌ఎస్ బలం తగ్గింది.
ఈ విషయం బహుశా గులాబీ పార్టీకి అర్థమయినట్టుంది.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ‘నీతులు వల్లించడం’ మొదలు పెట్టారు టీఆర్‌ఎస్ నేతలు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ‘అది బలుపు కాదు, వాపు’ అని బీజేపీని ఎద్దేవా చేసిన టీఆర్‌ఎస్, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం బిక్కచచ్చిపోయిందనే చెప్పాలి. ఆ భయంతోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కిందా మీదా పడుతోంది. సంప్రదాయాల్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. నిజానికి, నోముల నర్సింహయ్య.. వివాద రహితుడు.. ఆ మాటకొస్తే ఆయన అజాతశతృవు. ‘కామ్రేడ్’గా చాలామంది స్నేహితుల్ని రాజకీయాల్లోనూ సంపాదించుకున్నారాయన. ‘ఎర్ర’ పార్టీ నుంచి, గులాబీ పార్టీలోకొచ్చినా, చివరి రోజుల్లో ఆ ‘ఎర్ర’ పార్టీ మీద మమకారాన్ని ప్రదర్శించిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ ఆందోళనకి అదీ ఓ కారణమే. ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే, బీజేపీనే టీఆర్‌ఎస్‌ని ఎక్కువ భయపెడుతోంది. కానీ, దుబ్బాకలో పనిచేయని సెంటిమెంట్ అస్త్రం, నాగార్జునసాగర్‌లో పనిచేస్తుందని టీఆర్‌ఎస్ ఎలా నమ్ముతుంది.? టీఆర్‌ఎస్ వణుకు చూస్తోంటే, నాగార్జునసాగర్ ఉప ఎన్నికకంటే ముందే చేతులెత్తేసినట్టుంది.