“”””ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో న్యాయవ్యవస్థ విధులు నిర్వర్తించాల్సిన అవసరం లేదని.. ప్రజల బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పదలచుకున్నారా? ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న తన పట్ల రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అడిగినవాటికి స్పష్టత ఇవ్వకుండా.. తన వ్యాఖ్యల ఆధారంగా తనను విచారణ నుంచి వైదొలగాలంటూ సర్కారు పిటిషన్లు దాఖలుచేయడం సమంజసం కాదన్నారు. అయితే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు అనుమతించేది లేదని.. పదవీ విరమణ చేసేంతవరకు భయం, పక్షపాతం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తేల్చిచెప్పారు…”””
హైకోర్టు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కాదా?
జస్టిస్ రాకేష్ కుమార్ పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో పైన ఉటంకించిన వ్యాఖ్యలు చదివాక…తన అడ్డగోలు భజనలతో, స్తోత్రాలతో, శ్లోకాలతో చంద్రబాబును ఏవిధంగా భ్రష్టు పట్టించి శంకరగిరి మాన్యాలు పట్టించాడో, మళ్ళీ జస్టిస్ రాకేష్ కుమార్ ను కూడా అదేవిధంగా భ్రష్టు పట్టించి ఇంటికి పంపించేవరకూ నిద్రపోయేట్లు లేడు రాధాకృష్ణ అనిపిస్తుంది. అలాగే మొన్న రాసిన చెత్తపలుకులో హైకోర్టుకు స్వయంప్రతిపత్తి ఉన్నదని, హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీమ్ కోర్టుకు సబార్డినేట్స్ కారనే ఒక మహత్తరమైన సత్యాన్ని ప్రవచించి రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పట్ల తనకున్న అమోఘమైన పరిజ్ఞానాన్ని ప్రజలకు పంచామృతంలా పంచి పులకించి తరించారు రాధాకృష్ణ.
ఇదే జస్టిస్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే?
నిజానికి జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ ఇస్తున్న తీర్పులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి. అలాగే రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడ కుప్పకూలాయి అని హైకోర్టుకు తలంటారు ఆయన. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీమ్ కోర్టుకు సబార్డినేట్స్ కానపుడు జస్టిస్ రాకేష్ కుమార్ ఆ కేసు విచారణనుంచి ఎందుకు తప్పుకున్నారు? “సుప్రీమ్ కోర్ట్ నాకు బాస్ కాదు…వారి ఆదేశాలను నేను పాటించాల్సిన అవసరం లేదు” అని స్టే ఆర్డర్ ను ఎందుకు తిరస్కరించలేదు? సుప్రీమ్ కోర్ట్ చేసే బదిలీలను ఎందుకు అంగీకరిస్తున్నారు? తాము ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేస్తే ఎందుకు ఒప్పుకుంటున్నారు? సుప్రీంకోర్టు ఏ దేశంలోని అన్ని న్యాయవస్థలకు అధిపతి అని రాధాకృష్ణకు తెలియదేమో కానీ జస్టిస్ రాకేష్ కుమార్ కు మాత్రం బాగా తెలుసు. ఇదే జస్టిస్ రాకేష్ కుమార్ చంద్రబాబు, ఆయన ముఠా వేసే తప్పుడు పిటీషన్లను కొట్టేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే రాకేష్ కుమార్ నిజాయితీ, వైఖరి పట్ల రాధాకృష్ణ మరోరకంగా అభిప్రాయాలు కక్కేవాడు! కాదా? అవన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండటంతో రాకేష్ కుమార్ న్యాయపరిరక్షకుడుగా రాధాకృష్ణకు గోచరిస్తున్నాడు. అందుకే ప్రతి చిన్న విషయానికి ఆయనను మునగచెట్టు ఎక్కిస్తున్నాడు!
ప్రజా ప్రభుత్వం పట్ల ఇంత చులకనభావమా?
ఇక “ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కదా…ఎన్ని పిటీషన్లయినా వేస్తారు” అని జస్టిస్ రాకేష్ కుమార్ కామెంట్స్ చేసినట్లు పచ్చ మీడియా అచ్చొత్తింది. ఇదే నిజమైతే జస్టిస్ రాకేష్ కుమార్ పరిజ్ఞానాన్ని శంకించాల్సిందే. పిటీషన్లు వెయ్యడం పౌరుల హక్కు. ముక్కు ముఖం తెలియని వారు వేసే వందల, వేల పిటీషన్లను కూడా న్యాయస్థానాలు విచారిస్తున్నాయి. గత ఏడాది కాలంలో హైకోర్టు ఇలాంటి పిల్స్ ను ఎన్ని అనుమతించింది! సామాన్యులు వేసే పిటీషన్లను కూడా విచారిస్తున్న హైకోర్టు, ఒక ప్రజాప్రభుత్వం వేసే పిటీషన్లను గూర్చి చులకనగా మాట్లాడటం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను పరిహాసం చెయ్యడం కాదా?
రాజ్యాంగ నిర్మాతలు పొరపాటు చేశారా?
ఇక న్యాయవ్యవస్థ నిర్వహించాల్సిన విధులను ప్రభుత్వమే నిర్వహిస్తుందా అని ప్రశ్నించడం కూడా తన పరిధిని దాటి వ్యవహరించడమే. మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్వహించాల్సిన విధులను కూడా న్యాయవ్యవస్థ నిర్వహించాలనుకుంటుందా? ప్రభుత్వం అవసరం లేదనుకుంటుందా? ప్రభుత్వం కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, ప్రజల పట్ల తమకు లేని జవాబుదారీతనం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టుకు గ్రహింపు లేకపోవడం విడ్డూరం. ప్రభుత్వ అధికారుల్లో, విధుల్లో కూడా చొరబడాలని యత్నించడం, శాసించడం, కోర్టు ధిక్కరణ పేరుతో బెదిరించడం చూస్తుంటే…ప్రభుత్వ ధిక్కరణ కూడా నేరం అవుతుందని మన రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించకపోవడం పెద్ద తప్పేమో అనిపిస్తున్నది. ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా ప్రశ్నలకు అతీతం కాదని, ప్రజల సొమ్ముతో పొట్ట పోసుకునే ఎవరైనా, ఏ వ్యవస్థ అయినా ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిందే. మేము అతీతులం అని భావించడం వారి మానసిక అహంకారానికి నిదర్శనం మాత్రమే.
ఏమైనప్పటికీ, పత్రికల్లో ప్రచారం కోసం, ప్రశంసల కోసం న్యాయవ్యవస్థ వెంపర్లాడటం ఏమాత్రం సమర్ధనీయం కాదు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెడతా అని జస్టిస్ రాకేష్ కుమార్ ప్రతిన పూనడం సమంజసమే. ఆయన ఆ పని చెయ్యడానికి మరో వారం రోజులు మాత్రమే గడువుంది మరి!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు