కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ వాదనకు చెల్లు చీటీ? 

 
జ్యోతి శ్రీ 
 
 
 మోదీకి అయాచిత బలం చేకూర్చిన పిఓకె పై దాడులు.
 
 
కాశ్మీర్లో పుల్వామా వద్ద ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం దేశ వ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతి యావత్తు నినదించింది.కాని బెంగాల్ ఎపి ముఖ్యమంత్రులు మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల వైఫల్యంతో భారత దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు.
 
దేశంలో బిజెపియేతర పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపాలని భావించే వారందరికీ పుల్వామా సంఘటన తదనంతరం పిఒకె పై దాడులు సంభవించడం చేదు మాత్ర లాంటిది. ఎందుకంటే అంతటితో ఈ సంఘటనలు ఆగవని చైన్ రీ ఆక్షన్ వుంటుందని దీని పరిణామాలు ప్రధాని మోదీని బలవంతున్ని చేయడమే కాకుండా కేంద్రంలో అతుకుల బొంతగా వుండే సంకీర్ణ ప్రభుత్వం కాకుండా దేశ సమైక్యతను కాపాడే పటిష్టమైన సుస్థిర ప్రభుత్వం వుండాలసిన అవసరాన్ని తెర మీదకు తెస్తుందని వీరు భయ పడ్డారు. వాస్తవంలో అదే నేడు సంభవించింది. ఈ కోణంలో ఆలోచన చేసిన మమత బెనర్జీ చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లోనే పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
 
 పుల్వామా సంఘటన అవాంఛనీయమైనది. దేశ ప్రజలను తీవ్రంగా కలచి వేసేది. అయినా తదనంతర పరిణామాలు పరోక్షంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదికి రాజకీయంగా కలసి వచ్చింది.
 
పలు సందర్భాల్లో నేతలు ఊహించినట్లు పరిణామాలు సంభవించవు.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండిన నరేంద్ర మోదీ బిజెపిలో ఎందరో సీనియర్లను కాదని ప్రధాని అయ్యారు. తిరిగి నాలుగు ఏళ్లకే అప ప్రద మూట గట్టుకొన్నారు. ప్రతి పక్షాలను పక్కన పెడితే స్వ పక్షంలోనే పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
ఈ నేపథ్యంలో పుల్వామా మారణహోమం అందుకు ప్రతిగా భారత దేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల కేంద్రాలపై బాంబులు కురిపించడంతో ప్రధాని మోదీ రాజకీయంగా కోల్పోయిన బలంను తిరిగి పొందే దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయి.
 
గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ దాడులపై దేశంలో భిన్నమైన స్పందన వ్యక్తమైనా సోమవారం రాత్రి జరిగిన సర్జికల్ దాడులు దేశ ప్రజలను ఒక్క గొంతుకగా తీసుకు రావడమే కాకుండా పాక్ కూడా దిమ్మ తిరిగి పోయి కొన్ని బాంబులు జారిపడ్డాయని అంగీకరించ వలసి వచ్చింది.భారత్ ముందు ప్రధమ దశలోనే పాక్ డిఫెన్స్ లో పడింది. 
 
నియంత్రణ రేఖ వెంబడి నెల కొల్ప బడిన ఉగ్రవాదులకు చెందిన మూడు కేంద్రాలను భారత వాయు సేన నేల మట్టం చేయడం ఇటీవల కాలంలో కార్గిల్ యుద్ధం తర్వాత మొట్ట మొదటి చర్యగా భావించాలి. వేయికిలోలు బాంబింగ్ జరగడం పుల్వామా సంఘటనలో మృతి చెందిన మన వీర జవానుల ఆత్మ శాంతికి కానుకగా వుంటుంది.
 
ఈ సంఘటనల తదుపరి పాక్ కవ్వింపు చర్యలు అంతర్జాతీయంగా దేశాల స్పందన పక్కన పెడితే పుల్వామా దుసంఘటన తదుపరి భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులు దేశీయంగా ఒక నూతన భావ జాలాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చింది.ఒకవేపు పాక్ మరో వైపు అరుణాచల్ అంశంలో చైనా లేవ నెత్తు తున్న అభ్యంతరాలు ఈ నేపథ్యంలో మరీ ఎన్నికల ముందు దేశ సమగ్రత కాపాడ బడాలంటే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఆవశ్యకత అనే అంశం తెరపైకి వచ్చింది. 
 
నేడు వున్న జాతీయ అంతర్జాతీయ పరిస్థితులలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం అది కూడా భావ సారూప్యత లేని పార్టీలు కేవలం అధికారంలోనికిరావడం మంచిది కాదని ఏదైన సరే పూర్తి మెజారిటీ కలిగి అయిదు సంవత్సరాల సుస్థిరంగా మన కలిగిన ప్రభుత్వం ఏర్పాటు అవసరమని జరుగుతున్న సంఘటనలు నొక్కి చెబుతున్నాయి. 
 
అయితే గత అయిదు ఏళ్లుగా దేశ ప్రజలు ఎదుర్కొన్న మత దురహంకార విధానాలను తిరిగి దేశ ప్రజలు కోరుకోవడం లేదు. అదే సమయంలో కేంద్రంలో అతుకుల బొంత ప్రభుత్వాన్ని వాఛించడంలేదు. ఏదిఏమైనా ప్రస్తుతం దేశం క్రాస్ రోడ్డులో వుంది.