సిద్ధూ మీద ముంబై ఫిల్మ్ సిటీ నిషేధం

పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ ను పుల్వామా దాడి ఇంకా వెంటాడుతూనే ఉంది. పుల్వామా  దాడి తర్వాత  పాకిిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద నిషేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనను ముంబై ఫిల్మ్ సిటిలోకి రానీయకుండా వెస్టన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిషేధం విధించింది.

ఫిబ్రవరి 14 పుల్వామా లో సిఆర్ పిఎప్ కాన్వాయ్ మీద జరిగిన టెర్రరిస్టు దాడి మీద సిద్దూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిషేధం విధించారు. సిధ్దూ తన ‘ది కపిల్ శర్మ షో ఎపిసోడ్స్’ కామెడీ షో ను ఇక్కడి స్టూడియో ప్రాంగణంలో షూట్  చేసే వారు. ఇపుడాయనను ఈ ఏరియాలోకి రానీయవద్దని ఫెడరేషన్ నిర్ణయించిందని డిఎన్ ఎ పత్రిక రాసింది.

ఇంతకు ముందు పాకిస్తాన్ నటులతో పనిచేయడం మీద, పాకిస్తాన్ లో భారతీయ చిత్రాల విడుదల మీద కూడా  ఫెడరేషన్  నిషేధం విధించింది. ఇపుడు ఫెడరేషన్ సిధ్దూ మీద నిషేధం విధించింది. ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కు ఒక లేఖ రాస్తూ పాకిస్తాన్ సంతతి నటులతో పాటు సిధ్దూను కూడా స్టూడియోకు అనుమతించరాదని ఫెడరేషన్ కోరింది.

పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ మీద వస్తున్న విమర్శలను ఉటంకిస్తూ ఎవరో ఒక తీవ్రవాది చేసిన దాడికి పాకిస్తాన్ దేశాన్నంతా నిందించడం సబబు కాదని సిద్దూ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో దూమారం సృష్టించింది. నెటిజన్స్ మొదట సిధ్దూ ను తీసేసే దాకా కపిల్ శర్మ షోను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందిస్తూ కపిల్ శర్మ షోనుంచి సిధ్దూను తీసేశారు. ఈషోలోకి అర్చనా సింగ్ ను తీసుకువచ్చారు.

ఇపుడు ముంబై ఫిల్మ్ సిటీలోకి రాకుండా ఆయన మీదనిషేధం విధించారు.