(చిత్రం : ప్రేమ్ కుమార్ , విడుదల తేదీ : ఆగస్టు 18, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు. దర్శకత్వం: అభిషేక్ మహర్షి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం, ఎడిటర్: గ్యారీ బి హెచ్)
సంతోష్ శోభన్ హీరోగా, రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లుగా అభిషేక్ మహర్షి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. విడుదలకు ముందు ఈ సినిమాపై మేకర్స్ మంచి బజ్ నే క్రియేట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) రోజు ప్రేక్షకులముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం…
కథ : ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) పెళ్లి జరుగుతూ ఉండగా.. రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. తానూ, నేత్ర ప్రేమించుకున్నామంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ప్రేమ్ కుమార్ పెళ్లిళ్లు ఆగిపోతూనే ఉంటాయి. అయినా, ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అవ్వడం, అదీ క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తానికి పెళ్లి కావడం లేదని తెగ ఫ్రస్టేషన్ లో ప్రేమ్ కుమార్ ఏం చేశాడు ?, తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ ఎలా పెట్టాడు ?.. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? చివరకు ప్రేమ్ కుమార్ – నేత్ర ఒకటయ్యారా? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ : సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ గా నడిపాడు దర్శకుడు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. కొంచెం అయినా బెటర్ గా ఉండేది. సరే.. సినిమాలో లవ్ లేకపోతే పోయింది.. హీరో హీరోయిన్లు కొన్ని సీన్స్ లో చూసే ప్రేక్షకులకయితే.. మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది. ‘ప్రేమ్ కుమార్’ కథ కథనాలు మరీ స్లోగా సాగడంతో ప్రేక్షకులకు తలపట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వవు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ పోషించిన ప్రధాన క్యారెక్టర్ అయిన ప్రేమ్ కుమార్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన క్యారెక్టర్లు .. ఆ పాత్రల తాలూకు సిల్లీ కామెడీ సీన్స్.. ఇలా మొత్తానికి ‘ప్రేమ్ కుమార్’ సినిమా కాన్సెప్ట్ పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ ఓకే అనిపిస్తాయి. హీరోగా నటించిన సంతోష్ శోభన్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. సినిమాకే సంతోష్ శోభన్ హైలెట్ గా నిలిచాడని చెప్పొచ్చు. అలాగే.. మరో కీలక పాత్రలో నటించిన రాశి సింగ్ చక్కటి హావభావాలను ప్రదర్శించి నటనలో రాణించింది. ఇక రుచితా సాధినేని కూడా ఆకట్టుకునే నటనతో వాహ్.. అనిపించింది. ఆమె హావ భావాలు కూడా పాత్రకు తగ్గట్టే ఉండి పేక్షకులను అలరించాయి. ఇతర పాత్రల్లో నటించిన కృష్ణ తేజ,కృష్ణ చైతన్య, అశోక్ కుమార్, సుదర్శన్, శ్రీ విద్యలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమతమ పాత్రల పరిధి మేరకు మెరుగైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే.. దర్శకుడు అభిషేక్ మహర్షి మంచి ఫన్ వర్కౌట్ అయ్యే స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఆసక్తికరంగా నడపడంలో తడబడ్డాడు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం.. అలాగే మెయిన్ కథనాన్ని ఎలివేట్ చేయకుండా పూర్తి సిల్లీ ట్రాక్స్ తో బోరింగ్ క్యారెక్టర్స్ తో సినిమాని మహా బోర్ కొట్టించాడు. అసలు సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ కూడా సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు ప్రేమ్ కుమార్ క్యారెక్టర్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం : దర్శకుడు అభిషేక్ మహర్షి తాను రాసుకున్న కథను స్క్రీన్ మీద సరిగా… ప్రేక్షకులకు నచ్చేవిధంగా ప్రజెంట్ చేయలేకపోయాడు. అతను కథ మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. కొన్ని దృశ్యాలనయితే.. ఎంతో అందంగా చూపించాడు. సంగీతం ఆకట్టుకునేలానే ఉంది. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.
మొత్తానికి ఈ ‘ప్రేమ్ కుమార్’ రెగ్యులర్ సిల్లీ బోరింగ్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.