ఒకప్పుడు..అనగా పదిహేనేళ్ల క్రితం వరకు..కేంద్రప్రభుత్వం ఇంధన ధరలను ఏడాదికోసారి మాత్రమే పెంచుతుండేవారు. అదికూడా పావలా, అర్ధ రూపాయి మాత్రమే. ఆ మాత్రానికే నాటి విపక్ష పార్టీలు పెద్దఎత్తున జనాన్ని సమీకరించి ఆందోళనలు, ధర్నాలు, బందులు చేస్తుండేవి. వారం పదిరోజులపాటు దేశం అల్లకల్లోలం అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఆ తరువాత అంతా ష్..గప్చిప్…
1990 ప్రాంతాల్లో పెట్రోలు లీటర్ తొమ్మిది రూపాయల లోపు ఉండేది. ఎప్పుడూ పెరగడమే తప్ప తరగడం అనే మాటే తెలియదు. ముప్ఫయియొక్క సంవత్సరాల తరువాత వందరూపాయలు చేరువలో ఉన్నది. అయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బజెట్ లో పెట్రోల్ లీటర్ మీద నాలుగు రూపాయిలు వ్యవసాయ సెస్ ప్రతిపాదించినప్పటికీ దేశంలో ఒక్క రాజకీయపార్టీ కానీ, ఒక్క ప్రభుత్వ లేదా విపక్ష నాయకుడు కానీ నోరు మెదిపిన పాపాన పోలేదు. మోడీ మీద నిప్పులు చెరిగే మమతా బెనర్జీ కూడా సీరియస్ గా మోడీని విమర్శించినట్లు లేదు. ఏదో మొక్కుబడిగా ఒక ప్రకటన చేసి సైలెంట్ అయిపోవడమే కనిపిస్తున్నది. ఆందోళనలు, సమ్మెలకు మారుపేరైన సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా గత కొన్నేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మంగళం పలికాయి. మధ్యతరగతి వారి నెత్తిన ఎంత భారం మోపుతున్నా, ఆ తరగతి వారు కూడా స్పందించడం లేదు.
ఎందుకిలా మారిపోయింది పరిస్థితి?
స్వర్గీయ పీవీ నరసింహారావు పుణ్యమా అని ఆర్ధిక సంస్కరణల అమలు కారణంగా ఒక సరికొత్త భారతదేశం ఆవిష్కరించబడింది. ఒకప్పుడు కేవలం ధనికవర్గాలకు మాత్రమే పరిమితమైన అనేక రకాల విలాసాలు ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చాయి. పాతికేళ్ల క్రితం ఒక మోటార్ సైకిల్ ఉంటే గర్వంగా ఉండేది. ఇవాళ దాదాపు అందరి ఇళ్లల్లో కార్లు కనిపిస్తున్నాయి. చిరుద్యోగం చేసుకునే వారు కూడా కొత్తదో, పాతదో కారు మైంటైన్ చేయగలుగుతున్నారు. సొంత ఇళ్లను నిర్మించుకుంటున్నారు. చేతిలో రూపాయి లేకపోయినా క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉండటంతో అవసరం లేని వస్తువులను కూడా అవలీలగా కొనేస్తున్నారు. పిల్లలకు విద్యావకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్ కోర్స్ చెయ్యాలంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లాంటి దూరరాష్ట్రాలకు వెళ్లాల్సివచ్చేది. ఇవాళ దాదాపు అన్ని నగరాల్లోనూ ఇంద్రసభలను తలదన్నే కాలేజీలు వెలిశాయి. ఇంకా ఆసక్తి కలిగినవారు, తెలివితేటలు కలిగినవారు విదేశాలు వెళ్లి అక్కడి కాలేజీల్లో చేరుతున్నారు. పిల్లల సంపాదనలు కూడా బాగా పెరిగిపోయి ఒకప్పటి మధ్యతరగతి వారు తమ జీవనప్రమాణాలను చాలా ఉన్నతంగా పెంచుకోగలిగారు. ఇలాంటి వారికి పెట్రోల్, నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినా ఇబ్బందులు తెలియవు.
ఇక రాష్ట్రాల్లో లక్షలాదిమందికి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది. వీటిలో దొంగ కార్డులు చాల ఎక్కువ. కొన్ని ఒక్కో ఇంట్లో ఇద్దరికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకప్పుడు రేషన్ కార్డు పొందే అర్హత ఉండి, ఆ తరువాత ఆర్ధికంగా ఎదిగి, కార్డుకు అర్హత లేనివారు కూడా తమ పాత కార్డులను వాడుకుంటున్నారు. ఇవి కాక ప్రభుత్వం అమలు చేసే అనేక రకాల సంక్షేమపథకాల వలన కూడా లక్షలాదిమంది లబ్ది పొందుతున్నారు. అనేకమందికి లేని ప్రభుత్వ సౌకర్యాలను పొందుతూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చెయ్యడానికి వారి అంతరాత్మలు అంగీకరించడం లేదు. విద్యార్థులు రాజకీయపార్టీల వ్యామోహంలో పడటం లేదు. దాంతో రాజకీయపార్టీలు ఎంత ప్రయత్నించినా జనసమీకరణ ఇబ్బందిగా మారింది.
నిజం మాట్లాడుకోవాలంటే ఆర్ధిక సంస్కరణల వలన ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరిగి సంక్షేమ పధకాలు క్రమక్రమంగా కనుమరుగు కావాలి. కానీ వాస్తవంలో అలా జరగడంలేదు. కారణాలు ఏమిటో మేధావులు, ఆర్థికవేత్తలు అన్వేషించాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు