టీడీపీ – జనసేన పొత్తు గురించి చంద్రబాబు – పవన్ కి తప్ప మరెవరికీ అవగాహన లేదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ సీనియర్ నేతలకు సైతం ఈ విషయంలో ఒక క్లారిటీ లేదని చెబుతున్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను అనుసరించి నడుచుకోవడం మినహా ఈ పొత్తువిషయంలో వారికంతా చీకటిలో ప్రయాణమే అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఒకపక్క పవన్ వల్ల టీడీపీ నేతల్లో కాకమొదలైపోయిందని అంటున్నారు.
అవును… టీడీపీ – జనసేన పొత్తులు ఉంటాయా.. కలిసే పోటీ చేస్తారా.. అవగాహనతో ముందుకు వెళ్తారా.. బీజేపీని ఒప్పిస్తారా.. ఈ విషయాలపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కానీ స్పష్టత ఇవ్వడం లేదు. పైగా పూటకో మాట మాట్లాడే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలకు నమ్మకం ఉండటం లేదని చెబుతున్నారు. మరో పక్క బాబోరేమో ఏ విషయం చెప్పడం లేదు.
అక్కడితోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేసుకోవాలా.. డబ్బు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయాలా అనే మీమాంసలో ఉన్న సమయంలో… పవన్ వరుసపెట్టి అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతున్న పరిస్థితి. ఇందులో భాగంగా తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్… గాజువాక సీటుపై స్పందించారు. ఈసారి ఈ సీటు జనసేనదే అని చెప్పారు.
అవును… గతంలో చేదు అనుభవం మిగిల్చిన గాజువాక సీటు ఈ సారి కచ్చితంగా జనసేన ఖాతాలోనే అని పవన్ చెప్పుకొచ్చారు. అంటే పవనే ఇక్కడనుంచి పోటీ చేస్తారా.. లేక, మరెవరినైనా ఇక్కడ పోటీకి దింపుతారా అన్నది క్లారిటీ లేనప్పటికీ… గాజువాకలో పోటీ చేసేది మాత్రం బీజేపీ అభ్యర్థి కాదని, పరోక్షంగా టీడీపీ అభ్యర్థి కూడా కాదని తేల్చి చెప్పేశారు.
దీంతో… ఈ విషయంపై మీడియా ఊహాగానాలను ఆయన ఇప్పటిదాకా కొట్టి పారేస్తూ వచ్చిన టీడీపీ విశాఖ జిల్ల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డల్ అయిపోయారని అంటున్నారు. 2024లో ఈ సీటు తనదే అని ఇప్పటికే పోటీకి అంతా సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో పవన్ మైకందుకుని… గాజువాక జనసేన పోటీ చేసే సీటు అని చెప్పడంతో ఆయన వర్గం కాకెత్తిపోతుందని అంటున్నారు.
అయితే ఇది గాజువాకకు మాత్రమే పరిమితమైన సమస్య కాదనేది అంతా తెలిసిన విషయమే. ఇప్పటికే తెనాలి, కొవ్వూరు, రాజానగరం, పిఠాపురం, భీమవరం, పెందుర్తి మొదలైన స్థానాల్లో ఇప్పటికే జనసేన నేతలు ప్రచారాలు ముమ్మరం చేసుకున్నారని చెబుతున్నారు. మరి ఇక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజీపడి.. జై పవన్ అంటారా.. లేక, సైకిల్ దిగిపోయి ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది వేచి చూడాలి.