జైల్లోనే చంద్రబాబు.! టీడీపీ క్యాడర్‌లో అయోమయం.!

‘జై చంద్రబాబు’ కాదు, ‘జైలు చంద్రబాబు’ అయిపోయింది పరిస్థితి.! ఒకప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలగడంలో దిట్ట అనిపించుకున్న చంద్రబాబు, ఇప్పుడేమో.. జైల్లో మగ్గిపోతున్నారు.

రోజులు, వారాలు.. గడిచిపోతున్నాయ్.! స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊరట దక్కడంలేదు.! సమీప భవిష్యత్తులో ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడే అవకాశమూ కనిపించకపోవడంతో తెలుగు తమ్ముళ్ళలో నైరాశ్యం పెరిగిపోతోంది.

శుక్రవారం శుభం జరగబోతోందంటూ.. ఈ శుక్రవారమూ చాలా ఉత్కంఠగా ఎదురుచూశారు చంద్రబాబు అభిమానులు. ప్చ్.. ఊరట దక్కలేదాయె.! దాంతో, మొన్నటి వినాయక చవితి తరహాలోనే, ఇప్పుడిక విజయదశమిని కూడా చంద్రబాబు జైల్లోనే జరుపుకోవాల్సి రావొచ్చు.

ముందు ముందు దీపావళి, ఆ తర్వాత వచ్చే సంక్రాంతి కూడా చంద్రబాబు జైల్లోనే వుంటారా.? అంతేనేమో.. అలాగే జరుగుతుందేమోనని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. అసలు స్కామ్ జరిగిందో లేదో తెలియని కేసు.. అంటూ టీడీపీ లైట్ తీసుకుంటే, చంద్రబాబుకి అదే గట్టిగా మెడకి చుట్టేసుకుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ, ‘చంద్రబాబు తప్పు చేశారేమో..’ అని తెలుగు తమ్ముళ్ళలోనే అనుమానం పెరిగిపోతోంది. కానీ, ఇప్పుడెలా.? చంద్రబాబునీ, టీడీపీని నమ్ముకోవడం దండగ.. అన్న అభిప్రాయానికి తెలుగు తమ్ముళ్ళు వచ్చేయక తప్పడంలేదు.

భువనేశ్వరి అయినా, బ్రాహ్మణి అయినా.. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ అయినా.. టీడీపీని బాగు చేసే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికలదాకా చంద్రబాబుని జైల్లో వుంచగలిగితే.. అన్న కోణంలోనే వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.