నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఇప్పుడప్పుడే ముగిసేది కాదని గతంలోనే మనం చెప్పుకున్నాం. ఆ ప్రకారమే ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్యన వాదోపవాదనలు నడుస్తూనే ఉన్నాయి. హైకోర్టు, సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకున్నా ఇంకా తుది తీర్పు రాలేదు. ఇప్పటివరకు చూస్తే హైకోర్టు నిమ్మగడ్డను తిరిగి పదవిలోకి తీసుకోవాలని ఆదేశించగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని వెంట వెంటనే రెండు పిటిషన్లు వేసింది. కానీ సుప్రీం కోర్టు మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు కూడా వినాల్సిందేనని విచారణను వాయిదా వేసింది. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు నిమ్మగడ్డకు పూర్తిగా సమర్థించుకునే అవకాశం లేకుండా పోయింది.
సుప్రీం కోర్టు స్టే నిరాకరించడంతో నిమ్మగడ్డ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయంలేదని, ఇది కోర్టు ధిక్కరణ చర్యేనని హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన కోర్టు సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి తమ తీర్పు అమలులో ఉన్నట్టేనని, వద్దకు వెళ్లి తన నియామకం కోసం అభ్యర్థన చేయమని సూచించింది. దీంతో ఇక నిమ్మగడ్డ నియామకం ఖాయమని ప్రతిపక్ష పార్టీ మద్దతు మీడియా ఊదరగొడుతోంది. కానీ అదంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
హైకోర్టు నియామకం కోసం గవర్నర్ వద్దకు వెళ్లి విజ్ఙప్తి చేసుకోమన్నదే కానీ నిమ్మగడ్డను నియమించాల్సిందేనని గవర్నర్ ను ఆదేశించలేదు. అలా ఆదేశించరు కూడ. పైగా గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో తనకు తానుగా చేసుకున్న స్వీయ నియామకాన్ని, తాను పదవిలో కూర్చుంటున్నట్టు ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయడాన్ని సమర్థించలేదు. ఈరోజు కూడా ఈసీని నియమించే అధికారం గవర్నర్ కు ఉందని తెలిపింది. అంటే రమేశ్ కుమార్ నియామకం జరగాలంటే ప్రభుత్వం తరపున అనుమతులు ఉండాల్సిందేనని రూఢీ అయింది. కాబట్టి నెక్స్ట్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ వద్దకు వెళ్లినా ఆయన తక్షణ నియామక ఆదేశాలు ఇస్తారని చెప్పడానికి లేదు.
ఎందుకంటే ఆయన కేబినెట్ అభిప్రాయం కోసం కొంత సమయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇక కేబినెట్ ఎలాగూ అంత సులభంగా నిమ్మగడ్డ నియామకాన్ని ఒప్పుకోదు. పైగా హైకోర్టు నిమ్మగడ్డను గవర్నర్ వద్దకు వెళ్లి విజ్ఙప్తి చేసుకోమందే కానీ పలాన తేదీ లోపల నియామకం జరిగిపోవాలని ఆదేశాలేవీ జారీ చేయలేదు. సో.. గవర్నర్ వద్ద నిమ్మగడ్డకు నిరీక్షణ తప్పదని అర్థమవుతూనే ఉంది. ఇక ప్రభుత్వం మీద హైకోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ కోరగా హైకోర్టు దానికి కూడా వాదనలు వినిపించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. అంటే నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వ తరపున వాదనలు వినడానికి హైకోర్టు ఇంకా సుముఖంగానే ఉందని అర్థమవుతోంది.
ఇక వచ్చే వారం విచారణలో తమ వెర్షన్ వినిపించబోయే ప్రభుత్వం తమవి కోర్టు ధిక్కరణ చర్యలు కాదని, సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నామని, అవి రాగానే వాటి ప్రకారమే వెళ్లాలని అనుకుంటున్నట్టు చెబుతారు. సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అయ్యుంది కాబట్టి హైకోర్టు కూడా త్వరత్వరగా వ్యవహారాన్ని ముగించాలని తొందరపడకపోవచ్చు. అలాగే ఈసీ నియామక అధికారాలు గవర్నర్ కు ఉన్నాయని హైకోర్టే చెప్పింది కాబట్టి ఆ ప్రకారమే నిమ్మగడ్డ స్థానంలో విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించినట్టు తమని తాము సమర్థించుకోవచ్చు. కనుక తర్వాతి విచారణలో కూడా కేసు వాయిదా తప్పదు. ఇక సుప్రీం కోర్టు సైతం వచ్చే వాయిదాలో ప్రతివాదుల వాదనలు విన్న వెంటనే తీర్పు వెలువరిస్తుందా అంటే అదీ లేదు. సో.. నిమ్మగడ్డ ఎపిసోడ్లో సాగదీత ఇంకా మిగిలే ఉందన్నమాట.