నిమ్మగడ్డ కష్టం పగవాడికి కూడా వద్దు 

what is the YSRCP next strategy
 
నిమ్మగడ్డ కష్టం పగవాడికి కూడా వద్దు 
 
పంచతంత్రంలో ఒక కథ ఉన్నది.  పక్షులకు, జంతువులకు మధ్యన యుద్ధం వచ్చినపుడు ఒక కోడి ఏ వైపునా చేరకుండా చోద్యం చూస్తున్నది.  తమవైపుకు రమ్మని జంతువులు, తమవైపుకు రమ్మని పక్షులు కోరినా కోడి తాను మాత్రం తటస్తం అని, నిష్పక్షపాతం అని, యుద్ధం నిజాయితీగా జరగాలని ప్రవచనాలు ఇచ్చింది.  
 
యుద్ధం మొదలైంది.  రెండు వర్గాలు భీకరంగా పోట్లాడుకుంటున్నాయి.    కొంచెం సేపయ్యాక జంతువులదే విజయం అనిపించింది. దాంతో కోడికి భయం వేసింది.  జంతువులు గెలిచాక తనను బ్రతకనివ్వవు అని తలచి జంతువుల సైన్యాధ్యక్షుడి దగ్గరకు వెళ్లి “అయ్యా…నేను మీ జాతి వాడినే…పక్షుల్లా నేను ఆకాశంలో ఎగరలేను.   కాబట్టి నన్ను మీలో చేర్చుకోండి”  అని ప్రార్ధించింది.  కానీ జంతువులు తిరస్కరించి “జంతువులకు రెక్కలు ఉండవు.  నీకు రెక్కలు ఉంటాయి.  పైకి ఎగురుతావు.  పైగా మాలాగా నీకు నాలుగు కాళ్ళు ఉండవు.   కాబట్టి నిన్ను చేర్చుకోము” అని తరిమేశాయి.  
 
మరుసటిరోజు యుద్ధంలో పక్షులదే పైచేయి అయింది.  పక్షులు గెలిస్తే తనను చంపేస్తాయేమో అని భయపడి పక్షిరాజు దగ్గరకు పరుగు తీసి ” అయ్యా…నేను మీ జాతివాడినే.  నాకూ మీలాగే రెక్కలు ఉంటాయి.  పది అడుగులవరకు పైకి ఎగురుతాను.  మీ సైన్యంలో చేర్చుకోండి” అని బతిమాలింది.  కానీ పక్షులు తిరస్కరించి  “నువ్వు జంతువువు.  మాలాగా ఆకాశంలో ఎగరలేవు.  పిల్లులు, కుక్కలు, మేకలు, బర్రెలు, ఆవులు మొదలైన జంతువుల్లాగా  ఇళ్లల్లో పెరుగుతావు.  ఇంటి యజమానులు నిన్ను రాత్రివేళల్లో గంప కింద పెట్టి దాచిపెడతారు.  కాబట్టి నిన్ను చేర్చుకోము”  అని తరిమివేస్తాయి.  
 
దాంతో కోడి భయపడి పరాయిదేశానికి పారిపోయింది. 
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనబడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమీషనర్ మొదటినుంచి సందేహాస్పదుడే.  ఆయన చంద్రబాబు అడుగుజాడల్లో నడిచాడనేది నిస్సందేహం.  ఆయన ఎన్నికల కమీషనర్ అయ్యాక చంద్రబాబు మూడేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు.  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు రాజ్యాంగబాధ్యతలు, ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చాయి.  వెంటనే ఎన్నికల దండోరా మ్రోగించారు.   ఏకగ్రీవాలలో వైసిపి పాతికశాతానికి పైగా కైవసం చేసుకోగానే తెలుగుదేశం వారి అంతర్గత ఆదేశాలకు తలొగ్గి ప్రభుత్వానికి మాటమాత్రం చెప్పకుండా కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేశారు.  ఇక అప్పటినుంచి కరోనా నుంచి దేశాన్ని రక్షించిన మహానుభావుడిగా తెలుగుదేశం పార్టీ,  తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాడిగా వైసిపి విమర్శించడం మొదలు పెట్టాయి.  మధ్యలో నిమ్మగడ్డ పదవి పోవడం, ఆయన కోట్ల రూపాయల ఖర్చు చేసి లాయర్లను పెట్టుకుని న్యాయస్థానాల్లో పోరాడటం, చివరకు తన పదవిని తెచ్చుకోవడం, ఆయన వెనుక నిలబడి ఆర్ధిక, న్యాయసాయాన్ని అందిస్తున్నది తెలుదేశం పార్టీయేనని వైసిపి విమర్శలు చెయ్యడం..ఇదంతా తెలిసిన కథే.  
 
ఎన్నికల యుద్ధం మొదలయ్యాక కూడా తెలుగుదేశం వారికి ప్రయోజనం కలిగించడానికి నిమ్మగడ్డ తన శక్తిమేరా కష్టపడ్డారన్నది అందరికీ తెలుసు.  ఈ ఎన్నికలు జరుగుతుండగానే ఆయన మంత్రులను హౌస్ అరెస్ట్ చెయ్యాలని ఆదేశాలు ఇవ్వడం, మీడియా ముందు మాట్లాడకూడదని నిషేధాలు విధించడం,  నిమ్మగడ్డను ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిపించి మూడేళ్లు జైలుకు పంపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడం, నిమ్మగడ్డ వెనుకున్న దుష్టశక్తులను ఏరిపారేస్తామని మంత్రులు ప్రకటించడం ఈలోగా పంచాయితీ ఎన్నికల ఫలితాలు మొత్తం వైసిపికి అనుకూలంగా రావడమే కాక నిమ్మగడ్డకు పలుమార్లు కోర్టులో చుక్కెదురు కావడం, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రావడంతో నిమ్మగడ్డలో కూడా భయం ప్రవేశించింది.  తన అధికారం కేవలం కొద్ది రోజులు మాత్రమే.  ఆ తరువాత మూడేళ్లు వైసీపీయే అధికారంలో ఉంటుంది.  ఇప్పటికే నిమ్మగడ్డ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.   ఆయన పదవి పోయాక ప్రభుత్వం అంత తేలికగా ఆయన్ను విడిచిపెట్టే ఛాన్స్ లేదు.  
 
దాంతో నిమ్మగడ్డ వెనక్కు తగ్గుతూ వస్తున్నారు.  మాటలో దురుసుతనం తగ్గింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.   పైగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  నిన్న రేషన్ డెలివరీ వాహనాల రంగుల విషయంలో తన గత ఆదేశాలు వెనక్కు తీసుకోవడం అలాంటిదే.  
 
నిమ్మగడ్డ మారిపోయారని, ఆయన జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని ఇప్పుడు తెలుగుదేశం చెవికోసిన మేకలా అరుస్తున్నది.  నిమ్మగడ్డ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నది.  ప్రజాస్వామ్యాన్ని చంపేశాడని తన భజన ఛానెల్స్ ద్వారా నిమ్మగడ్డ మీద నిప్పులు కురిపిస్తున్నది.  అలాగని వైసిపి సైలెంట్ గా ఏమీ లేదు.  వాళ్ళు కూడా ఈరోజుకూ నిమ్మగడ్డను తప్పు పడుతూనే ఉన్నారు.  
 
చివరకు నిమ్మగడ్డ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా, లారీ టైరు కింద పడి  నలిగిన 
నిమ్మకాయలా తయారైంది.  ఆయన్ను ఏ పార్టీ వారూ నమ్మడం లేదు.  స్వయంకృతాపరాధం మరి! 
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు