రాష్ట్ర రాజకీయాలనే కాక సాధారణ ప్రజలను కూడా ఒక్క కుదుపు కుదిపిన సంఘటన! క్షుద్ర రాజకీయాలకు, కుటిల మంత్రాంగాలకు, కుత్సిత కుతంత్రాలకు రాజ్యాంగ సంస్థలు ఎలా బలైపోతున్నాయో ప్రజల కళ్ళకు నగ్నంగా ప్రదర్శించిన సంచలనాత్మక ఘట్టం! అత్యంత హేయమైన ఈ సంఘటన అయిదేళ్లనాటి ఓటుకు నోటు కేసును తలుపుకు తెస్తున్నది. అక్కడ ఏమి జరిగిందో దేశం మొత్తం రోజంతా వీక్షించి విస్తుపోయింది. ఈ కుతంత్రం బయటపడిన తరువాత దాన్ని సమర్ధించుకోవడానికి తెలుగుదేశం, బీజేపీ నాయకులు పడుతున్న పాట్లు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
విషయం అందరికీ తెలిసిందే కాబట్టి దాని లోతుల్లోకి వెళ్లాల్సఅవసరం లేదు. పతనమై పోతున్న నైతికవిలువలను తలచుకుని బాధపడి తీరాల్సిందే. లేకపోతె మనకు ప్రజాస్వామ్యం అంటే అర్ధం తెలియనట్లే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదటినుంచి అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన తన సామాజికవర్గ ప్రయోజనాలకోసమే పని చేస్తున్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆరోపించారు. అప్పట్లో జగన్ ను తప్పు పట్టినవారు నేడు నిజాన్ని గ్రహించి ఆశ్చర్యపోతున్నారు. ఒక ఉన్నతాధికారి ఇంత నీచానికి దిగజారతారా అని బిత్తరపోతున్నారు. నిమ్మగడ్డను ఎలెక్షన్ కమీషనర్ పదవినుంచి తొలగించింది ప్రభుత్వం. ఆయన కోర్టుకు వెళ్లారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానిమీద సుప్రీంకోర్టు కు వెళ్ళింది ప్రభుత్వం. అక్కడ విచారణ జరుగుతున్నది.
ఇలాంటి సమయంలో నిమ్మగడ్డకు అనుకూలంగా పిటీషన్ వేసిన బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్, బీజేపీ ముసుగులో దూరి జైలు శిక్ష నుంచి తప్పించుకున్న ఆర్ధిక ఉగ్రవాది సుజనాచౌదరి రహస్యంగా తెలంగాణలోని పార్క్ హయత్ హోటల్ లో కావడం ఏమిటి? గంటన్నర పాటు చర్చించడం ఏమిటి? వారు ఏ విషయాల మీద చర్చించారు? ఎవరితో చర్చించారు? అన్నీ కూహకాలే. వారు ముగ్గురూ చర్చలు జరిపింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అని వైసిపి ఆరోపిస్తున్నది. ఇది రహస్య సమావేశం కాదని, తమ ఆఫీస్ పార్క్ హయత్ హోటల్లో ఉన్నదని సుజనా చౌదరి బుకాయిస్తున్నారు. అది రహస్య సమావేశం కాకపొతే…ముగ్గురు ప్రముఖ వ్యక్తులు హోటల్లో కలిసినపుడు ఆ వివరాలు మరునాడు పత్రికల్లో రావాలి కదా? వచ్చాయా? ఫుటేజ్ లు బయటపడిందాకా తేలుకుట్టిన దొంగల్లా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు బరితెగించి నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు?
అక్కడ రమేష్ కుమార్ ను కలిసింది బీజేపీ నాయకులు. ఆ మీటింగ్ తో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. మరి వారి తరపున తెలుగుదేశం వకాల్తా పుచ్చుకుని ఎందుకు ఖండన మండనలు చేస్తున్నది? రమేష్ కుమార్ తన బంధువు అని, తన అనుమతి తీసుకుని కలిశారని సుజనా చౌదరి చెబుతున్నారు. తన కేసు గూర్చి కేంద్ర పెద్దలకు సిఫార్స్ చెయ్యమని కోరడానికే రమేష్ కుమార్ సుజనా చౌదరిని కలిశారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య చెబుతున్నారు! ఆ సంగతి రామయ్యగారికి ఎలా తెలిసింది? ఆయనకు ముందుగా సమాచారం ఇచ్చారా? పోనీ తాము ఎందుకు కలుసుకున్నామో మీడియాకు వివరించాలని రామయ్యగారిని సుజనాచౌదరి కోరారా? బీజేపీ నాయకుడు రఘురాం కూడా మింగలేక కక్కలేక నిన్న ఒక ఛానెల్లో నీళ్లు నములుతూ సుజనాచౌదరిని సమర్ధించడం చూస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు ఏ విధంగా దిగజారిపోతున్నారో స్పష్టం అవుతుంది. వారి సమావేశానికి, మా పార్టీకి సంబంధం లేదని కేంద్ర నాయకత్వం ప్రకటించినప్పుడు సుజనాచౌదరి, నిమ్మగడ్డలను సమర్ధించాల్సిన అవసరం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఏమిటి?
ఇక వర్ల రామయ్యగారి సమర్ధనలోని నైతికతను పరిశీలిద్దాము. నిమ్మగడ్డకు ఏదైనా ఉద్యోగపరంగా, విధులపరంగా ఇబ్బందులు ఉంటే వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకోవాలి. అది కూడా ఆయన తిరిగి విధుల్లో చేరాక మాత్రమే. ఇప్పుడు ఆయన విధుల్లో లేకపోయినా, కోర్ట్ ఆర్డర్ ఆయన్ను ఎన్నికల కమీషనర్ గా గుర్తిస్తున్నది. అలాంటపుడు ఒక ప్రయివేట్ వ్యక్తికి తన కష్టనష్టాల గూర్చి ఎలా చెప్పుకుంటారు? అది నిబంధనలకు వ్యతిరేకం కాదా? నిమ్మగడ్డ అధికారికంగా రాజ్యాంగ సంస్థకు అధిపతి. మాజీ ఐఏఎస్ అధికారి. రాష్ట్రం మొత్తాన్ని శాసించగలరు. సుజనాచౌదరి వందలమంది ఎంపీలలో ఒకరు. కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి. ప్రస్తుతం సామాన్యుడు. శతకోటి బోడిలింగాలలో ఒకడు. ఉన్నతహోదాలో ఉన్న నిమ్మగడ్డ ఆఫ్టరాల్ ఒక ఎంపీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం ఏమిటి? అదికూడా ఒక ప్రయివేట్ హోటల్లో! ప్రజాస్వామ్యాన్ని ఎంత నవ్వులపాలు చేస్తున్నారు వీరు!
కేవలం కేసులనుంచి తప్పించుకోవడానికే బీజేపీలో దూరిన సుజనాచౌదరి, బీజేపీ ముసుగువేసుకున్న కామినేని..ఈ ఇద్దరూ చంద్రబాబుకు బానిసలే అని ఇప్పటికీ లోకం అంతా ఎరిగిన సత్యం. వీరు ముగ్గురూ అక్కడ చేరి ఎవరితో మంతనాలు జరిపారు? జగన్ అమలు చేస్తున్న పథకాలకు అడ్డంకులు సృష్టించడం ఎలా అన్న అంశం మీద చంద్రబాబుతో ఆన్లైన్ చర్చలు జరిపి ఉంటారని విశ్లేషకుల నమ్మకం. వైసిపి ప్రభుత్వం దీన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య హంతకులను బోను ఎక్కించాలి. బీజేపీకి ఏమాత్రం సిగ్గూ శరం, మానాభిమానాలు ఉన్నా, సుజనాచౌదరిని, కామినేని శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. అలాగే రాజ్యాంగపదవికి ద్రోహం చేస్తూ ప్రయివేట్ వ్యక్తులతో చేతులు కలిపి ప్రజాప్రభుత్వం మీద కుట్ర చేసినందుకు నిమ్మగడ్డ మీద కేసులు పెట్టి తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇలాంటి పట్టుబడిన ఘోరాలను కూడా సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోతే వైసిపిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు.
Read More : మూడు రాజధానుల బిల్లుపై చంద్రబాబు ధీమా అదే?
పాతిక సంవత్సరాల క్రితం వరకు రాజ్యాంగసంస్థలైన గవర్నర్, కాగ్, సిబిఐ, ఈడీ, ఎన్నికల కమీషన్ లాంటి అనేకానేక సంస్థలు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది. రాను రాను పరమనీచులు, దుష్టులు, దుర్మతులు, నికృష్టులు, కులగజ్జి వెధవలు సిఫార్సులతో, దొడ్డిదారిని పదవుల్లో చీడపురుగుల్లా చేరి వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారు. కులపిచ్చితో, ధనపిచ్చితో మీడియా కూడా వారికి వంత పాడుతూ ప్రజాస్వామ్య విలువలను హత్య చేస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించకపోతే ప్రజాస్వామ్యవ్యవస్థకు పెనుముప్పు తప్పదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు