టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరం సమీపంలోని గునుపూడి ప్రాంతంలో, టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.
నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయట. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యా రాళ్ళ దాడి జరిగింది. ‘యువగళం’ పాదయాత్ర కోసం ప్రత్యేకంగా నియమితులైన తెలుగు తమ్ముళ్ళు కొందరికి ఈ ఘటనలో గాయాలయ్యాయట.
పలువురు వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాయలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం వుందంటూ కాస్సేపు నారా లోకేష్ నానా యాగీ చేశారు. నిజమే, ఈ తరహా ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీదనే వుంది.
కానీ, పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలా పని చేస్తోంది.? ఆ వ్యవస్థ మీద రాజకీయ పెత్తనాలు ఎలా వున్నాయన్నది బహిరంగ రహస్యం.
ఇంతకీ, భీమవరంలోనే ఎందుకీ ఈ ఉద్రిక్త పరిస్థితి.? దాదాపు 200 రోజులకు పైనే సాగుతోంది నారా లోకేష్ పాదయాత్ర. ఎక్కడా లేని అల్లరి, భీమవరంలో ఎందుకు జరిగినట్లు.? పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం.. ఆపై, ఇటీవల వారాహి విజయ యాత్ర ఇదే భీమవరంలో బంపర్ హిట్ అవడం.. ఇవన్నీ టీడీపీనే జీర్ణించుకోలేకపోతోందా.? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ కార్యకర్తలు కాదు.. ఆ ముసుగులో టీడీపీ కార్యకర్తలే గలాటా చేశారన్నది ప్రధానంగా వినిపిస్తోన్న వాదన.