వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరుస బహిరంగ సభలతో జనసేన అధినేత దూసుకుపోతున్నారు. ఇక ఆ సభల్లో మైకందుకున్న అనంతరం పూనకాలు లోడింగ్ అంటున్నారు. అయితే శృతిమించిన విమర్శలు, సినిమా డైలాగులను ప్రతిబింబించేలా చేస్తున్న వ్యాఖ్యలు… పవన్ ని ఇరుకున పెడుతున్నాయి. ఫలితంగా అధికార పార్టీ నేతలు వరుసపెట్టి వాయించేస్తున్నారు. అయితే తాజగా ముద్రగడ ఒక లేఖ విడుదల చేశారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అనే స్లోగన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్న పవన్… నన్నెవడ్రా అడిగితే అన్నట్లుగా ప్రసంగాలు చేస్తున్నారనే విమర్శ రాజకీయ వర్గాల్లో ఉంది. పైగా ఆ విమర్శలకు ప్రతివిమర్శ వచ్చిన అనంతరం పవన్ సైలంటుగా ఉండిపోతున్నారు. అంటే… బురదజల్లేసి వెళ్లిపోతున్నారు. అనంతరం అధికారపార్టీ నేతలు చేస్తున్న ఛాలెంజ్ లపై పలాయనం చిత్తగించినట్లు ప్రవర్తిస్తున్నారు.
తాజాగా శృతిమించుతున్న పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ… పార్టీ పెట్టిన తర్వాత పదిమందితో ప్రేమించబడాలే కానీ… వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకూ న్యాయమంటారు అని ప్రశ్నిస్తూ మొదలుపెట్టారు.
అనంతరం… “తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కుర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు కదండి… ఇప్పటివరకూ ఎంతమందికి తీయించి క్రింద కుర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి గీయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలండి” అంటూ సున్నితంగా వాయించారు ముద్రగడ.
ఇదే సమయంలో… “బీజేపీ, టీడీపీ, మీరు కలిసి పోటీ చేస్తామని తరుచూ అంటున్నారు. అటువంటప్పుడు నా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి అనే పదం వాడాలి తప్ప.. కలిసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది” అంటూ సూచించారు ముద్రగడ పద్మనాభం.
ఇదే సమయంలో కులాన్ని వాడుకుని కొంతమంది నాయకులు బాగుపడుతున్నారు కనీ… జనం మాత్రం బాగుపడటం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ సీరియస్ గా స్పందించారు. “నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడి ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారు” అని స్ట్రాంగ్ గా బదులిచ్చారు ముద్రగడ.
ఇదే సమయంలో “నా కంటే చాలా బలవంతుడైన పవన్.. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి, యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏమిటో అడిగి తెలుసుకో పవన్. బీసీల నుంచి పిల్లి సుభాష్ ని, కాపుల నుంచి బొత్సను సీఎం చేయమని అడిగా” అని ముద్రగడ పవన్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు.
ఏది ఏమైనా… రాజకీయాల్లో పవన్ కి ఉన్న పరిపూర్ణమైన అపరిపక్వతపై తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం ఈ స్థాయిలో స్పందించడం పవన్ కు గట్టి షాక్ అనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. దీంతో… పవన్ కి ఆ సామాజికవర్గంలో ఉన్న క్రెడిబిలిటీపై మరిన్ని సందేహాలు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇలా ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ రాజకీయ వ్యవహార శైలి ముందు ముందు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోందనేది వేచి చూడాలి.