ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి ముందస్తు బెయిల్.!

ఒకటోస్సారి.. రెండోస్సారి.! ఔను, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి రెండో సారి ముందస్తు బెయిల్ లభించింది. గతంలో ఓ సారి ముందస్తు బెయిల్ లభించగా, ఆ బెయిల్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హత్యకు జరిగిన కుట్రలో అవినాశ్ రెడ్డిది కీలక పాత్ర అని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ, ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది కూడా.!

కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో తల్లి అనారోగ్యం పేరుతో అవినాశ్ రెడ్డి హైడ్రామా నడిపారన్న ఆరోపణలున్నాయి. తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఆమెను చూసుకోవాలి గనుక, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారనీ, బెయిల్ ఇవ్వకూడదనీ, ఈ కేసులో అతని పాత్ర వుందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని సీబీఐ వాదించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో, అరెస్టు నుంచి అవినాశ్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినట్లయ్యింది. సీబీఐ ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా.? అన్నది తేలాల్సి వుంది.