మద్య నిషేధం.! వైఎస్ జగన్ తదుపరి టార్గెట్ అదే.!

సీపీఎస్ రద్దు దిశగా వైఎస్ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దు కాదు, జస్ట్ పేరు మారిందంతే.. అన్న విమర్శల సంగతి పక్కన పెడితే, ‘జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే..’ అని ప్రచారం చేసేసుకుంటోంది వైసీపీ.

సో, తదుపరి కార్యక్రమం మద్య నిషేధమేనని అనుకోవాలి. ‘మద్య నిషేధం చెయ్యకపోతే, మళ్ళీ ఓట్లు అడగబోం..’ అని స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలు చాలామంది 2019 ఎన్నికల సమయంలో చెప్పారు.

ఆ లెక్కన, వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడగాలంటే, మద్య నిషేధం చేసి తీరాల్సిందే. కోవిడ్ సహా అనేక సమస్యల కారణంగా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోలేకపోయింది జగన్ సర్కారు.

ఇప్పుడు సమస్యలన్నీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లే. ఇదే సరైన సమయం, మద్య నిషేధం చేసెయ్యాలంటూ వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కానీ, అది అంత తేలికైన వ్యవహారం కాదు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై ప్రవహిస్తుంది రాష్ట్రంలోకి.

మరెలా.? సీపీఎస్ రద్దు తరహాలోనే, మద్య నిషేధానికి సంబంధించి ఓ వ్యూహం ఖరారు చేస్తోందిట వైసీపీ సర్కారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, రెండు మూడు నెలల్లోనే ఈ విషయమై కీలక ప్రకటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి రాబోతోందిట.

ఒక్కటి మాత్రం నిజం. సర్వ దరిద్రాలకీ కారణం మద్యపానం. ఆ మద్యాన్ని నిషేధిస్తే, ప్రజారోగ్యం మెరుగు పడుతుంది. కానీ, ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది.! ఎలా.? ఏం జిమ్మిక్కు చేయబోతున్నారు వైఎస్ జగన్.?